ఒక్క బీసీ.. వంద కుట్రలు!

28 Apr, 2014 00:30 IST|Sakshi
ఒక్క బీసీ.. వంద కుట్రలు!

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యేను.. ఈ ఎన్నికల్లో నాకు టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారు. ఓ వర్గం నన్ను పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తోంది...’ ఇది టికెట్ల కేటాయింపునకు ముందు నందీశ్వర్‌గౌడ్ వ్యక్తం చేసిన ఆవేదన. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే వచ్చి నందీశ్వర్‌కు టికెట్ ఇచ్చింది. అయినా అదే వర్గం ‘శల్యసారథ్యం’ చేస్తూ సొంత పార్టీ అభ్యర్థికే ‘చెయ్యి’చ్చి ‘కారు’ గేర్లు  మారుస్తున్నారు. గెలిచే సీటును కుట్రలు కుతంత్రాలతో ఓడించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక్క బీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పటాన్‌చెరు సెగ్మెంట్ బరిలో ఉన్నారు. పార్టీ కేడర్‌తో ఎన్నికల్లో దూసుకె ళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తుంటే సొంత పార్టీ ముఖ్యులే ఆయనను కుట్రపూరితంగా వెనక్కినెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి పోటీదారులతో కలిసి సొంత పార్టీ అభ్యర్థిని ఓడించే కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం. పార్టీ టికెట్ కేటాయించే సమయం నుంచి తెరవెనక ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం నాయకులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం ముందు వారి ఆటలు సాగలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నందీశ్వర్‌గౌడ్‌కు టికెట్ కేటాయించారు. ఇది మింగుడుపడని పటాన్‌చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్యనేతలు నందీశ్వర్‌గౌడ్‌ను ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బతీయాలనే తలంపుతో కుట్రలకు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

 భూపాల్‌రెడ్డి ప్రచారానికి దూరం
 కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్‌కు మద్దతుగా ఇంతవరకు ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. దీన్ని సొంత పార్టీ నేతలే బహిరంగంగా తప్పుబడుతున్నారు. భూపాల్‌రెడ్డి దూరంగా ఉండటంతో ఆయన అనుచరులు, మద్దతుదారులు సైతం ఆయన దారిలోనే పయనిస్తున్నట్టు సమాచారం.

 ముఖ్యంగా రామచంద్రాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్‌కు మద్దతుగా పనిచేయటంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్.. భూపాల్‌రెడ్డితో సహా అందరినీ కలుపుకునే ప్రయత్నాలు చేసినా సొంత పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన లభించటంలేదని తెలుస్తోంది. ఏఐసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు స్వయంగా కలగజేసుకుని భూపాల్‌రెడ్డికి ఫోన్‌చేసి నందీశ్వర్‌గౌడ్‌కు సహకరించాలని సూచించిన విషయం విదితమే. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వార్తలు