ఎన్నికల సర్వేలను నిషేధించం

31 Mar, 2014 03:42 IST|Sakshi

చట్టం తేవటమే ఉత్తమం: కేంద్రానికి ఈసీ స్పష్టీకరణ
 ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధానికి చట్టం ఉంది
 అభిప్రాయ సర్వేలపైనా అదే పద్ధతి ఉండాలి
  మాకున్న అధికారాలతో నిషేధించినా అది చట్టబద్ధంగా నిలవడం కష్టం
 
 న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అభిప్రాయ సర్వేల (ఒపీనియన్ పోల్స్) ప్రచురణ, ప్రసారాలపై తాము నిషేధం విధించబోమని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. రాజ్యాంగంలోని 324వ అధికారణ కింద ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించుకుని అభిప్రాయ సర్వేలను నియంత్రించవచ్చని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఇటీవల ఈసీకి సూచించింది.
 
  అయితే.. అలా చేయటం చట్టబద్ధంగా నిలిచే అవకాశం ఉండకపోవచ్చని.. కాబట్టి దీనిపై కేంద్రం ఒక చట్టం తేవటమే ఉత్తమమని న్యాయశాఖకు ఈసీ సమాధానం ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడిపై నియంత్రణకు చట్టం ఉన్నందున అభిప్రాయ సర్వేలపైనా అదే పద్ధతి అనుసరించాలని ఈసీ సూచించింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి తుది విడత పోలింగ్ ముగిసే వరకూ అభిప్రాయ సర్వేల ప్రచురణ, ప్రసారాలపై నిషేధం ఉండాలని ఈసీ ప్రతిపాదిస్తోంది. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 28న కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే ఇప్పటివరకూ తమ సూచనపై ఎలాంటి చర్యా చేపట్టలేదని విచారం వ్యక్తంచేసింది.
 
 ప్రస్తుత చట్టం ప్రకారం.. ఓటింగ్‌కు కేవలం 48 గంటల ముందు నుంచి మాత్రమే అభిప్రాయ సర్వేలను నిషేధించే అధికారం ఈసీకి ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి తుది విడత పోలింగ్ వరకూ ఎన్నికల అభిప్రాయ సర్వేలను నిషేధించాలన్న ఈసీ ప్రతిపాదనకు ఇంతకుముందు అటార్నీ జనరల్ కూడా మద్దతు తెలిపారు. అయితే.. ప్రభుత్వం ఈ విషయాన్ని న్యాయ కమిషన్ పరిశీలనకు సిఫారసు చేసంది. ఆ కమిషన్ ఇప్పటికే ఎన్నికల సంస్కరణల అంశాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ప్రస్తుత దశలో చట్టం తీసుకురావటం సాధ్యం కాదని, కాబట్టి ఈసీ 324వ అధికరణ కింద తనకు గల అధికారాలను ఉపయోగించి అభిప్రాయ సర్వేలపై నియంత్రణ విధించాలని కేంద్రం సూచిస్తోంది.
 
 ఎన్నికల సర్వేల ప్రచురణ, ప్రసారాలను మేం నిషేధించలేం. రాజ్యాంగంలోని 324వ అధికరణ ప్రకారం.. ఏ చట్టం పరిధిలోకి రాని అంశాలపై ఎన్నికల కమిషన్ తన అధికారాలను వినియోగించి ఆదేశాలు ఇవ్వొచ్చని కేంద్ర న్యాయశాఖ చెప్తోంది. కానీ.. 77వ అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకునే కార్యనిర్వహణ చర్యలన్నీ రాష్ట్రపతి పేరు మీద తీసుకుంటారు. ఆ ప్రకారం ఎన్నికల కమిషన్ అభిప్రాయ సర్వేలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోజాలదు.
 - రాంచీలో సీఈసీ వి.ఎస్.సంపత్
 

మరిన్ని వార్తలు