వేడెక్కుతున్న వెండితెర

17 Apr, 2014 01:16 IST|Sakshi

ఎలక్షన్ సెల్: ఎన్నికల వేళ సమకాలీన రాజకీయాల చుట్టూ కథ నడిపిస్తూ సినిమాలు రావడం, సంచలనాలు, కలకలాలు సృష్టించడం తెలుగునాట కొత్తేమీ కాదు. ఎన్‌టిరామారావు  రాజకీయరంగ ప్రవేశంతో 1983 నుంచి బలపడిన ఈ ఆనవాయితీ గత ఎన్నికల వరకు బలంగా కొనసాగింది. ఎన్నికల కురుక్ష్రేతానికి సమయం ముంచుకొస్తున్నా ఈసారి మాత్రం కాస్త ఆలస్యంగానే వెండితెర వేడెక్కుతోంది. సినిమా షూటింగ్‌లు ఎప్పుడో పూర్తయి కోల్డ్‌స్టోరేజ్‌ల్లో ఉన్న బాక్సులను ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో  నిర్మాతలు ఎట్టకేలకు ఇప్పుడు బయటకి తీస్తున్నారు. రాజకీయాలు, రాజకీయనేతలు, ప్రభుత్వాల పాలనాతీరుపై తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎన్నోరకాల చిత్రాలు వచ్చాయి.
 
 కానీ 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాలనాతీరు, వ్యక్తిగత వ్యవహారశైలిని ఎక్కుపెడుతూ వచ్చిన సినిమాల ‘కథ‘ వేరు. నేరుగా ఓ వ్యక్తిని, ఓ పార్టీని లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీయడం, ఎన్నికల వేళ విడుదల చేయడం ఆయన హయాం నుంచే మొదలైంది. నేరుగా ఎన్టీఆర్‌ను పోలిన నటులతో తీసిన మండలాధీశుడు, గండిపేట రహస్యం అప్పట్లో సంచలనం సృష్టించాయి. అలాగే ఎన్టీఆర్  తీరును ఎండగడ్తూ విజయనిర్మల దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘సాహసమే నా ఊపిరి’,  నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ నటించిన ‘రాజకీయ చదరంగం’ సినిమాలు 1989 ఎన్నికల ముందే విడుదలయ్యాయి. ఇక ఎన్టీఆర్ అనంతరం చంద్రబాబును లక్ష్యంగా చేసుకునీ పలు చిత్రాలు వచ్చాయి. ప్రముఖదర్శకుడు దాసరి నారాయణరావు రూపొందించిన ‘పిచ్చోడి చేతిలో రాయి’ సినిమా 1999 ఎన్నికల ముందే విడుదలైంది.
 
 గత 2009 ఎన్నికల ముందు రాజకీయాల చుట్టూ కథ నడిపిస్తూ సినిమాలు వెల్లువలా వచ్చాయి.  చిరంజీవి రాజకీయరంగప్రవేశం నేపథ్యంలో 2009లో దాసరి సంధించిన ‘మేస్త్రీ’  కలకలం రేపింది. దాసరి ఆ సినిమాలో మేస్త్రీ పాత్రలో చిరంజీవిని, ఆయన  పెట్టిన ప్రజారాజ్యం పార్టీని ప్రధాన లక్ష్యంగా వ్యంగ్యోక్తులతో విరుచుకుపడ్డారు. ఇక అదే ఏడాది ఎన్నికల వేళ మార్చిలో జగపతిబాబు హీరోగా వచ్చిన అధినేత, నరేంద్రనాయుడు హీరోగా నేనే ముఖ్యమంత్రినైతే, పోసాని కృష్ణమురళి తీసిన రాజా వారిచేపల చెరువు సినిమాలు తెరపైకి వచ్చాయి. ఇలా వచ్చిన ప్రతి సినిమాలోనూ ‘‘ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు... ఎవరినీ ఉద్దేశించినవి కావు... ఎవరూ వాటిని ఆపాదించుకోవద్దు’’ అని ప్రకటన వేసినా సినిమా అంతా సమకాలీన రాజకీయాలు, ఆ చిత్ర నిర్మాత నిర్దేశించుకున్న  ప్రధాన పార్టీల నేతల తీరు చుట్టూనే తిరుగుతూంటుంది. ఎన్నికల వేళ వర్తమాన రాజకీయ నేపథ్యంలో వచ్చే సినిమాలు చూసేందుకు ఉత్సాహం చూపే ప్రేక్షకులూ ఉంటారు. గత ముప్పై ఏళ్లుగా ప్రతి ఎన్నికల ముందు ఇలాంటి ‘సిత్రాలు’ వచ్చినా ఈసారి మాత్రం ఆ ఊపు ఒకింత తగ్గిందనే చెప్పాలి.
 
 మళ్లీ  ‘ప్రతిఘటన’
 ప్రస్తుత రాజకీయాలు నేపథ్యంగా తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన సినిమా ‘ప్రతిఘటన’. దీన్ని ఈనెల 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో చార్మి, రేష్మ ప్రధాన తారాగణం. పాతికేళ్ల కితం సినీపరిశ్రమలో సంచలనం సృష్టించిన ప్రతిఘటన సినిమా మాదిరిగానే ఇది కూడా అందరినీ ఆలోచింపజేసే సినిమా అవుతుందని భరద్వాజ చెబుతున్నారు. ఇక ఓటర్లలో అవగాహన పెంచి వారిలో ఉద్యమస్ఫూర్తిని రగిలించేందుకు కృషి చేసిన నలుగురు యువకుల కథతో తెరకెక్కిన ‘ప్రభంజనం’ కూడా ఈనెల 18నే విడుదలకు రెడీ అవుతోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత ఇతివృత్తమే కథాంశంగా సుమన్ హీరోగా.. జై రాజశేఖరా.. దేవుడు కాని దేవుడు ఉపశీర్షికతో ఓ సినిమా తెరకెక్కుతోంది.

మరిన్ని వార్తలు