ఓట్ల కోసమే బీసీ జపం

20 Apr, 2014 01:48 IST|Sakshi
ఓట్ల కోసమే బీసీ జపం

బాబూ.. బీసీలపై ప్రేమ నిజమైతే ఇప్పటిదాకా పార్టీని వారికి ఎందుకివ్వలేదు
 
అధికారం, బీఫామ్స్ నీ దగ్గర పెట్టుకొని అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు
 ఉద్యమ పార్టీ ఓట్ల రాజకీయం చేస్తోంది.. సీట్ల కోసం కొట్లాడుతోంది
 బంగారు తెలంగాణ మాకొద్దు.. భాగ్యాల తెలంగాణ కావాలి. పంటలు పండే తెలంగాణ కావాలి.
 నీటి కోసం, కూటి కోసం, నిలువ నీడ కోసం కష్టాలు పడని తెలంగాణ కావాలి

 
 ‘‘తెలంగాణ బీసీల మీద చంద్రబాబుకు ఒక్కసారిగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఆయన చెప్పే మాటలే నిజమైతే.. ఇప్పటిదాకా తన పార్టీని బీసీలకు ఎందుకు అప్పగించలేదు? సంపూర్ణ అధికారాలతో తెలంగాణ కమిటీని ఏర్పాటు చేశాడా..?’’ ప్రజాయుద్ధ నౌక గద్దర్ వేస్తున్న ప్రశ్న ఇది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వడం దగ్గర్నుంచి ఎవరిని ఎంపిక చేయాలన్న అధికారాలన్నీ తన చేతుల్లోనే పెట్టుకున్న చంద్రబాబు.. బీసీ ఓట్ల కోసం కల్లబొల్లి మాటలు చెబుతున్నారని అన్నారు. ‘‘50 శాతానికిపైగా ఉన్న బీసీల ఓట్లు తీసుకుంటున్న చంద్రబాబూ... 15 శాతం కూడా లేని నీ సామాజిక వర్గం బీసీలను శాసించడం ఏమిటి? ఇదేనా నువ్వు బీసీలకిచ్చే స్వేచ్ఛ? ఇదేనా నువ్వు తీసుకొచ్చే బీసీ రాజ్యం? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఇలాంటి అవకాశవాద రాజకీయాల ముసుగును ప్రజలే తొలగించాలి’’ అని పిలుపునిచ్చారు.

 బంగారు తెలంగాణ కాదు..
భాగ్యాల తెలంగాణ, పంటలు పండే తెలంగాణ రావాలంటున్న
గద్దర్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
అవకాశవాద రాజకీయ వ్యూహాలు..

‘తెలంగాణ వచ్చినాదో లచ్చువమ్మా.. మనకేమి తెచ్చినాదే మాయమ్మా....!’ పోరుగడ్డ వేసే ప్రశ్న ఇది. గుణాత్మక మార్పును కోరే ప్రతి బిడ్డా లేవనెత్తే సందేహమిది. దీనికి పార్టీలిచ్చే జవాబు అప్రజాసామికంగానే కన్పిస్తోంది. ఈ తెలంగాణను బీసీలకే అప్పగిస్తామని బాబు చెబుతున్నాడు. దళితుడికే రాజ్యాధికారమని కేసీఆర్ చెప్పాడు. గుణాత్మక మార్పులేని ఈ భావజాలంలో ఎన్నికల ఎత్తుగడలు, ఓట్ల రాజకీయమే కనిపిస్తోంది. దగాకోరు పరిష్కారాలే ముందుకొస్తున్నాయి. అభాగ్యుల తెలంగాణను భాగ్యాల తెలంగాణగా చేస్తామన్న భరోసా రావడం లేదు. ‘కుచ్చిపేల్కల లచ్చువమ్మకు.. అంచు చీర వస్తుందనే’ నమ్మకం కల్గడం లేదు. ‘బాంచన్ దొర’ అనే బతుకులు మారతాయన్న విశ్వాసం మచ్చుకైనా కన్పించడం లేదు. ఉద్యమాల యుగంలోనూ పార్టీల అవకాశవాద రాజకీయాలే వ్యూహాలే అమలవుతున్నాయి.
 
ఉద్యమ పార్టీ.. ఓట్ల రాజకీయం

ఉద్యమ పార్టీ ముసుగేసుకున్న మరో తెలంగాణ పార్టీ ప్రజలను మోసం చేయాలని చూస్తోంది. తెలంగాణ ఆకాంక్షలను పక్కనపెట్టి ఓట్ల రాజకీయ నడుపుతోంది. సీట్ల కోసం కొట్లాడుతోంది. దళితుడికే సీఎం, మైనార్టీలకే డిప్యూటీ సీఎం... అని నిన్న చెప్పిన నేత, ఈ రోజు మాట మార్చాడు. అశాస్త్రీయ పద్ధతిలో ఓట్ల స్లోగన్ అందుకున్నాడు. బంగారు తెలంగాణ తెస్తానంటూ నమ్మబలుకుతున్నాడు. ఎంపీ సీట్లన్నీ తన ఖాతాలో వేయమంటున్నాడు. అసెంబ్లీ మొత్తం తనకే పట్టం కట్టమంటున్నాడు. బంగారు తెలంగాణ దేనికి? మెడలో వేసుకోవడానికా? ప్రజలు కోరుకునేది.. దగాబడ్డ తెలంగాణ బిడ్డ ఆశించేది.. భాగ్యాల తెలంగాణ. పంటలు పండే తెలంగాణ. ఉపాధి ఉండే తెలంగాణ. నీటి కోసం, కూటి కోసం, నిలువ నీడ కోసం కష్టాలు పడని తెలంగాణ. దుక్కి దున్నే జానెడు నేలున్న తెలంగాణ. ఇది ఇస్తానని భరోసా ఇవ్వడేం? భూమిపై హక్కు ఇస్తానని చెప్పడేం?
 
ప్రశ్నించే వాళ్లంటే భయమా?

తెలంగాణ కోసం తన్నులు తిన్న వాడేమయ్యాడు? జైలుపాలైనోడు ఏమయ్యాడు? ఊరికో జేఏసీ పెట్టినోళ్లు, రోడ్డెక్కిన విద్యార్థి, కాలి బూడిదైన ముద్దుబిడ్డ, వందల కేసుల్లో ఇరుకున్న వాళ్లు, ఒళ్లంతా లాఠీల దెబ్బలతో గాయాలైనవాళ్లు... వీరంతా ఏమయ్యారు? 17 ఎంపీ సీట్లవ్వండి.. కేంద్రాన్ని ఆడిస్తానంటున్న నేత... ఉద్యమించిన వాళ్లను అభ్యర్థులను చేస్తే విజయం తథ్యం కాదా? ఆ పని చేయడు. చేయలేడు. ఎందుకంటే ఉద్యమించే వాళ్లు పక్కలో బల్లెం. ఆడిందే ఆట అంటే ఊరుకోరు. నిలదీస్తారు. ప్రశ్నిస్తారు. మళ్లీ ఉద్యమిస్తారు. అవసరమైతే తిరగబడతారు. ఇలాంటి శక్తులు వాళ్లకు అవసరం లేదు. సై అంటే సై దొర అనే వాళ్లే కావాలి. వాళ్లతోనే పబ్బం గడుస్తుంది. ఉద్యమకారులకు టిక్కెట్లిచ్చి, వాళ్లతోనే సర్కారును కూల్చేసుకునే సాహసం ఏమాత్రం చేయలేరు. అలాంటప్పుడు దీన్ని ప్రజాస్వామ్యం అందామా? తెలంగాణ పునర్‌నిర్మాణం సాధ్యమని భావిద్దామా?

భూమిపై హక్కు ఇస్తామని ఎందుకు అనడం లేదు?

అధికారమే రాకుండా పునర్ నిర్మాణం ఎలా సాధ్యం అనేది రాజకీయ పార్టీల వితండ వాదం. అసలు నిర్మాణమే లేకుండా మీరేం పునర్ నిర్మాణం చేస్తారని ఉత్పత్తి శక్తులు ప్రశ్నిస్తున్నాయి. పార్టీల మేనిఫెస్టోలో ఇలాంటి ఒక్క ఆనవాలూ కన్పించడం లేదు. బర్రె ఇస్తాం,  గొర్రె ఇస్తాం, ఇంటికో గ్యాస్ కనెక్షన్ ఇస్తామంటున్నారు. భూమిపై హక్కు ఇస్తామని మాత్రం తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకునే వాళ్లు కూడా భరోసా ఇవ్వడం లేదు. పేద ప్రజల పోరాటమే భూమి కోసమైనప్పుడు.. చిత్తశుద్ధిలేని పార్టీలను ఎలా నమ్ముతాయి?
 హా    రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక తెలంగాణను జనం కోరుతున్నారు. సంపదలో పునర్ నిర్మాణం జరగాలి. భూములు పంచుతామని చెప్పే నేతలు, ముందు వాళ్ల భూములు పంచాలి. అడ్డగోలుగా పోగైన ఫాంహౌస్‌లను పేదలకు ఇవ్వాలి. యావత్ కుటుంబానికి పదవులు ఇవ్వడం కాదు. యావత్ ప్రజల ఆకాంక్షలను నెత్తికెత్తుకోవాలి.
 హా    రాజకీయ పునర్ నిర్మాణం అతి కీలకమైంది. ఏ తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టారో... ఆ ఉద్యమ శక్తులే ‘బీ’ఫామ్స్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. అంతే తప్ప నువ్వే అభ్యర్థులను నిర్ణయించి, పునర్ నిర్మిస్తామంటే అది కేవలం ఓట్ల నిర్మాణమే అవుతుంది.
 హా    సాంస్కృతిక పునర్‌నిర్మాణం ఇంకో ముఖ్యమైన అంశం. పేద ప్రజలు తినే తిండి, వాళ్లు వేసుకునే దుస్తులు, నివసించే స్థలంతో సమానంగా రాజకీయ నేతల తిండి, దుస్తులు, నివాస స్థలం ఉండాలి. వారి పనుల్లోకి మీరు వెళ్లగలగాలి. అప్పుడే సాంస్కృతికంగా తెలంగాణ ప్రజలతో ఏకమవ్వడం సాధ్యమవుతుంది. వారి జీవన విధానాలకు దగ్గరవ్వడం సాధ్యం.

 ఇచ్చిందెవరు? తెచ్చిందెవరు?

 తెలంగాణ ఇచ్చామని ఒకరు.. తెచ్చామని ఇంకొకరు.. మద్దతునిచ్చామని మరొకరు.. ఎంత అందంగా చెప్పుకుంటున్నారు. నిజంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎత్తుగడల ద్వారానే తెలంగాణ వచ్చిందా? అదే నిజమైతే తెలంగాణపై పార్లమెంటులో గానీ, అసెంబ్లీలో గానీ ఏమాత్రమైనా చర్చ జరిగిందా? ఢిల్లీ సభలో చీకట్లోనే బిల్లు పాసయింది. మన అసెంబ్లీలో ఉరుములు, మెరుపులతో చర్చ ముగిసింది. ఇక్కడ అన్ని పార్టీలు స్వలాభమే చూసుకున్నాయి.  ఇవన్నీ ఓట్లు, సీట్ల రాజకీయాలు మాత్రమే. నిజానికి ఉద్యమాల ద్వారానే తెలంగాణ వచ్చింది. అశేష ప్రజానీకం త్యాగాల ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నారు. ఈ ఉద్యమ త్యాగాలను ఓట్లుగా పునర్‌నిర్మాణం చేసుకుని పార్టీలు పంచుకుంటున్నాయి.

 సెటిలర్స్ అంటే ఊరుకోం

 ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడూ ఈ ప్రాంతం వాడే. వారిని సెటిలర్స్ అని అనడం సరికాదు. అసలీ పదమే నిషేధించాలి. ‘కామోష్ క్యోం హై’ పాట ఆగలేదు. స్వరం మూగబోలేదు. ఉద్యమ ఎత్తుగడల్లో భాగంగానే మౌనం దాల్చాం. ఈనెల 26 నుంచి అన్ని టీవీ చానళ్లలోనూ నా పాట విన్పిస్తా. తెలంగాణ కోరుకునేదేంటో అందులో మేళవిస్తా. రాజకీయ కుతంత్రాలను బట్టబయలు చేస్తా. ఎన్నికల బహిష్కరణకు ఈసారి పిలుపిస్తున్నాం. అయితే ఉద్యమ పార్టీల ఈ నినాదాన్ని పాలకవర్గాలు తెలివిగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘నోటా’ పెట్టారు. అప్రజాస్వామికమైన ఈ ఎన్నికల విధానాన్ని గౌరవించేందుకు సాగుతున్న ఎత్తుగడ ఇది.
 

మరిన్ని వార్తలు