ఇదీ బెట్టింగే...

26 Mar, 2014 01:35 IST|Sakshi
ఇదీ బెట్టింగే...

గుసగుసలు: క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కాదు, బెట్టింగుల జోరు రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి? ముఖ్యమైన నేతల్లో ఎవరికెంత మెజారిటీ వస్తుంది..? వంటి అంశాలపై బెట్టింగులకు దిగుతుంటారు. తెలంగాణలో ఒకరకంగా, సీమాంధ్రలో మరోరకంగా పార్టీల జయాపజయాలపై బెట్టింగులు జోరందుకున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఆవరణలోనే ఇద్దరు నేతలు సై అంటే సై అంటూ పరస్పరం బెట్టింగుకు దిగారు.
 
 కాంగ్రెస్‌లోనే ఉంటూ, ‘సమైక్య’ చాంపియన్‌గా ప్రచారం పొందేందుకు చివరి వరకు విఫలయ్నతం చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి, విభజన నిర్ణయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ పేరిట సొంత కుంపటి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వస్తాయా? జై సమైక్యాంధ్ర పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయా? అనే దానిపై ఇద్దరు నేతలూ మాటా మాటా పెంచుకుని లక్షల్లోనే బెట్టింగ్‌కు దిగారు. ఇదంతా గమనిస్తూ పక్కనే ఉన్న మరో ఇద్దరు నేతలు క్రికెట్ బెట్టింగుల కంటే ఇదేదో ఆసక్తికరంగా ఉందే! అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు