మెతుకు సీమలో లేడీ బాస్ ల బిగ్ ఫైట్!

25 Apr, 2014 16:25 IST|Sakshi
మెతుకు సీమలో లేడీ బాస్ ల బిగ్ ఫైట్!

మెతుకు సీమ మెదక్ అసెంబ్లీ స్థానానికి ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిగ్ ఫైట్ జరగనుందా? ప్రస్తుత రాజకీయ సమీకరణాలను చూస్తే కాదనక తప్పదు. ఈ నియోజకవర్గంలో పలువురు ప్రధాన పార్టీ అభ్యర్థులు వారి వారి విజయంపై ధీమాగా ఉన్నా.. ఇద్దరు మహిళా నేతల మధ్యే  ముఖ్య పోటీ జరుగనుంది. ఇందులో ఒకరు లేడీ అమితాబ్ విజయశాంతి అయితే..మరొకరు పద్మా దేవేందర్ రెడ్డి. వారు నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ లో ఉంటూ క్రియా శీలక రాజకీయాల్లో పాలు పంచుకున్న ఈ నేతలు.. ఇప్పుడు ప్రత్యర్థులగా మారి కత్తులు దూసుకుంటున్నారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు భుజాలు కలుపుకుంటూ తిరిగిన వారే వేరువేరు పార్టీల నుంచి బరిలో దిగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పట్నుంచో కేసీఆర్ పై గుర్రుగా ఉన్న విజయశాంతి.. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటనతో ఊపిరి పీల్చుకుంది. ఇక ఒక నిమిషం కూడా వెనుకడగువేయని లేడీ బాస్ కాంగ్రెస్ లో చేరి టీఆర్ఎస్ తో పోరుకు సన్నద్ధమైంది.

 

దీంతో టీఆర్ఎస్ కూడా వేగంగానే పావులు కదిపింది. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా ఇంఛార్జి పద్మా దేవేందర్ రెడ్డికి ఆ పార్టీ టికెట్  కేటాయించి విజయశాంతిపై రాజకీయ సమరానికి సై అంటూ సవాల్ విసిరింది. పద్మా దేవేందర్ రెడ్డి.. తొలిసారి 2004 లో టీఆర్ఎస్ తరుపున గెలుపొందారు. కాగా, 2009లో టీఆర్ఎస్ -టీడీపీలో పొత్తులో భాగంగా ఆమెకు  టికెట్ రాలేదు. దీంతో ఆమె టీఆర్ఎస్ రెబల్ గా మారి పోటీకి దిగారు. ఆ పోరులో ఆమె 24 వేల ఓట్లు సాధించి తన ఇమేజ్ ను కాపాడుకున్నారు. ఆ తరువాత ఆమె టీఆర్ఎస్ లో నే కొనసాగారు. విజయశాంతిది కూడా  దాదాపు ఇదే పరిస్థితి.  బీజేపీని  వీడి టీఆర్ఎస్ చలవతో మెదక్ ఎంపీగా గెలిచారు. అనంతరం రాములక్క కేసీఆర్ అన్నపై అలిగి పార్టీని వీడారు. ఇలా మొన్నటి వరకూ ఒకే పార్టీలో ఉంటూ మిఠాయిలు తినిపించుకుని ఉన్న వీరు ప్రత్యర్థులుగా మారడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు ముందంజలో ఉండగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతుంది. ఇందులో పద్మా దేవేందర్ రెడ్డి స్థానిక అభ్యర్థి కావడం ప్రధానంగా కలిసొచ్చే అంశం. అంతే కాకుండా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ లోక్ సభ స్థానం నుంచే పోటీ చేయడం పద్మకు లాభిస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

 

కాగా, విజయశాంతి ఎంపీగా ఉన్న సమయంలో స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయశాంతి తాగునీటి సమస్యలకు నిధులు తీసుకురావడమే కాకుండా, అక్కన్నపేటకు కొత్తగా రైల్వే లైన్ లు తేవడంలో సఫలమైయ్యారు. ఇవే కాంగ్రెస్ గెలుపుకు దోహద పడగలవని కాంగ్రెస్ నేతలు ఘంటా పథంగా చెబుతున్నారు. కాగా, విజయశాంతికి స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత కూడా ఉండటంతో రాములమ్మ గెలుపుపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ను  ఎదురించి కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగడం నిజంగానే విజయశాంతికి ఛాలెంజ్.  ఇక ఈ పోరులో నెగ్గికొస్తే మాత్రం ఆమె స్థానికంగా తిరుగులేని నాయకురాలిగా వెలుగొందే అవకాశం ఉంది. ఒకవేళ ఓటమి పాలైనా అంతే వేగంగా ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.

మరిన్ని వార్తలు