ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్లు ఆడుతున్న బిజెపి: సోనియా

14 Apr, 2014 20:42 IST|Sakshi
మొరాదాబాద్ బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సోనియా గాంధీ, కాంగ్రెస్ అభ్యర్థి బేగం నూర్ బానో

 మొరాదాబాద్(యుపి): అతివాద భావజాలమున్న ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్లు బీజేపీ ఆడుతోందని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిది సమాజాన్ని విభజించే సిద్ధాంతమని ఆరోపించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రెండు పూర్తి భిన్నమైన సిద్ధాంతాల మధ్య పోరాటమని ఆమె అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్‌లో సోమవారం  ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

 మైనార్టీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జాతీయ వక్ఫ్ అభివద్ధి కార్పొరేషన్ లాంటి చారిత్రక నిర్ణయాలతో ముస్లిం మహిళల అభివద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్ మొదలైన వారి అడుగు జాడల్లో కాంగ్రెస్ నడుస్తుంటే.. మరోవైపు అతివాద భావజాలం ఉన్న సంస్థ చెప్పినట్లు బీజేపీ పని చేస్తోందన్నారు. ఎన్నో ఏళ్లుగా విలువలు, సిద్ధాంతాలను తాము భద్రంగా చూసుకుంటే.. బిజెపి వాటిని ధ్వసం చేస్తోందని మండిపడ్డారు.  దేశానికి కావలసిన స్థిరమైన, సమర్థవంతమైన పాలన అందించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పారు.

 మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బేగం నూర్ బానో పోటీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు