ఈసారి 150 : గతంలో కంటే అధిక స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ

20 May, 2014 21:57 IST|Sakshi
ఈసారి 150 : గతంలో కంటే అధిక స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ

 సాక్షి, ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో మహా గెలుపును సాధించిన బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటి నుంచే కనీసం 150 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలనుకుంటోంది.  288 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో శివసేన 171 స్థానాలు, బీజేపీ 117 స్థానాల్లో పోటీ చేసింది. శివసేన 45 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ 46 స్థానాలు దక్కించుకుంది. దీంతో శివసేనకంటే ఒక్క స్థానం అధికంగా లభించడంతో ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది.
 
1994లో అధిక స్థానాలు దక్కించుకున్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి, బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. అనంతరం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అధిక స్థానాలున్న శివసేనకే ప్రతిపక్ష నాయకుడి పదవి లభించింది. అయితే 2009లో ఒక్కసీటు కారణంగా ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సీన్ మరింతమారేలా చేసింది. అధిక స్థానాలతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మహాకూటమికి మొత్తం 51 శాతం ఓట్లు వచ్చాయి. వీటిలో బీజేపీకి 27.57 శాతం, శివసేనకు 20.82 శాతం ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిక స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది.
 
 మారనున్న ఫార్ములా..?
 సీట్ల పంపకాలలో కొత్త ఫార్ములాతో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గత 20 సంవత్సరాలకుపైగా శివసేన, బీజేపీల కూటమి కొనసాగుతోంది. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే, దివంగత బీజేపీ నాయకులు ప్రమోద్ మహాజన్‌ల హాయాంలో లోక్‌సభలో బీజేపీకి అధికంగా, అసెంబ్లీలో శివసేనకు అధిక సీట్లు కేటాయించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ కోటాలోకి 26 రాగా, శివసేనకు 22 స్థానాలు వచ్చాయి.
 
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాల్లో శివసేన కోటాలో 171, బీజేపీ కోటాలో 117 స్థానాలున్నాయి. అయితే గతంలో శివసేన, బీజేపీలే మిత్రపక్షాలుగా ఉండగా, ఈసారి మహాకూటమిగా మారిన ఈ కూటమిలో ఆర్‌పీఐ, శివసంగ్రామ్, స్వాభిమాని షేత్కారీ పార్టీ తదితరాలున్నాయి. దీంతో ఫార్ములా మార్చాల్సి రానుంది. శివసేన, లేకపోతే బీజేపీ నుంచి కొన్ని స్థానాలను వీరికి కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు బలం పెరగడంతో బీజేపీ 150 స్థానాల్లో పోటీచేస్తే శివసేన, ఇతర పార్టీలకు ఎన్ని స్థానాలు కేటాయించనున్నారనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు సమచారం. అయితే కొత్తఫార్ములాకు శివసేన ససేమిరా అంటుంది.  పాతఫార్ములాతోనే పోటీ చేసినా కొన్ని స్థానాలను తమ మిత్రపక్షాలకు  కేటాయిస్తామని శివసేన పేర్కొంటున్నట్టు తెలుస్తోంది.
 
 మారుతున్న సీన్...?

 కాషాయ కూటమిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దివంగత నేత బాల్‌ఠాక్రే హాయాంలో ఏ నిర్ణయమైన ఆయనతో సంప్రదింపుల అనంతరమే తీసుకునేవారు. శివసేనకు అంతటి ప్రాధాన్యత ఉండేది. అయితే బాల్‌ఠాక్రే మరణానంతరం మార్పువచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. సామ్నా దినపత్రికలో బాల్‌ఠాక్రే తనదైన శైలిలో ప్రత్యర్థులతోపాటు అవసరమైన సమయంలో మిత్రపక్షమైన బీజేపీపై కూడా విమర్శలు సంధించి తమ ప్రాధాన్యత ఏమిటన్నది చాటుకునేవారు.
 
 ఇటీవలే గుజరాతీయుల అంశంపై ప్రచురితమైన సామ్నా సంపాదకీయంపై  నరేంద్ర మోడీ నిరసన తెలిపినట్టు సమాచారం. దీంతో వెంటనే ఉద్ధవ్‌ఠాక్రేతోపాటు ఇతర నాయకులు సామ్నా పత్రికలో రాసిన సంపాదకీయంతో పార్టీ నాయకత్వానికి సంబంధం లేదని ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రభావంతో సంజయ్ రావుత్ అధికారాలను కూడా కొంచెం తగ్గించారు. దీన్నిబట్టి   కాషాయకూటమి(మహాకూటమి)లో కొంత సీన్ మారిందని చెబుతున్నారు. అయితే అలాంటిదేమి లేదని శివసేన, బీజేపీలు పేర్కొంటున్నాయి.
 
 పాత పద్ధతిలోనే పోటీ: ఉద్ధవ్
 
 సాక్షి, ముంబై: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం ఉద్ధవ్‌ఠాక్రే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎన్డీయేతో సమావేశం తర్వాత ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. దేశాన్ని పటిష్టం చేసేందుకు బీజేపీతో కలిసి పని చేస్తామని, మంత్రి పదవులపై ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగలేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మంత్రి పదవులపై శివసేన తొందరపడడం లేదని, మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే చర్చిస్తామని అన్నారు.
 
 బీజేపీ ప్రభుత్వానికి తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి నిర్ణయాలైన కలిసే తీసుకుంటామని అన్నారు.  ఇది ఒక చారిత్రాత్మక విజయమని, దీంతో తమ కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఐకమత్యంతో శాసనసభ ఎన్నికలకు వెళతామని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనను ఏ విధంగా తిరస్కరించారో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందని, ఓటమి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును ఇప్పటికీ తాము వ్యతిరేకిస్తున్నామన్నారు, ఒకవేళ అది మంచిది, సురక్షితమే అయితే  దేశంలోని ఇతర ఏ రాష్ట్రాలకైనా తరలించాలి. కానీ ఈ ప్రాజెక్టు మాకొద్దు అని స్పష్టం చేశారు.
 
 ఒకవేళ విద్యుత్ అవసరమైతే ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందో అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ‘మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాకూటమి ఎంపీలు అపాయింట్‌మెంట్ తీసుకుంటారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళతార’న్నారు. ఇతర అంశాలతోపాటు నష్టపరిహారం గురించి చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గురించి విలేకరులడిగిన ప్రశ్నకు ఉద్ధవ్ నోరు విప్పలేదు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ ఏదైన అఘాయిత్యానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. 

మరిన్ని వార్తలు