బొత్సకు ఫ్యామిలీ ప్యాక్!

14 Apr, 2014 02:59 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుని ఒంటరైన బొత్స సత్యనారాయణే కాంగ్రెస్‌కు దిక్కయ్యా రు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమై సీమాంధ్రలో నిలువనీడలేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి బొత్స ఫ్యామిలీ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. దొందూదొందే అన్నట్టు ఇటు బొత్స, అటు కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి ఉంది. జిల్లాలో పోటీ చేయబోతున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు ఖరారైంది. పార్వతీపురం నియోజకవర్గం తప్ప మిగతా నియోజకవర్గాల అన్నింటికీ అధిష్టానం అభ్యర్థుల్ని ఖరారు చేసింది. గెలుపు అవకాశాల్లేకపోయినా పరువు కోసం అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఆ పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు ఏ ఒక్కరూ ఆసక్తి చూపకపోవడంతో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న  పీసీసీ మాజీ  అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబీకులకే కాంగ్రెస్ మరోసారి సీట్లిచ్చింది. ఒక కుటుంబంలో ఇద్దరికి మించి ఇవ్వకూడదని తెలంగాణలో నిర్ణయించుకున్నా ఇక్కడ మరో ప్రత్యామ్నాయం లేక విభజన పాపాన్ని మూటగట్టుకున్న బొత్స ఫ్యామిలీపైనే ఆధార పడింది. ఆ కుటుంబానికి చెందిన నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఒకరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు.

ఇక సాలూరు, కురుపాం నియోజకవర్గాలకు కొత్త ముఖాలను ఎంపిక చేయగా, బొబ్బిలి, శృంగవరపుకోట నియోజకవర్గాలకు గత ఎన్నికల్లో  ఓటమి పాలైన అభ్యర్థులను నిలబెట్టింది.     ఎన్ని విమర్శలొచ్చినా, ఆరోపణలు వెల్లువెత్తినా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను మరోసారి చీపురుపల్లి అభ్యర్థిగా బరిలోకి దించింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఏ ఒక్కరూ ఆసక్తి చూపకపోవడంతో తప్పని పరిస్థితుల్లో బొత్సను ఎంపిక చేసింది. ఆయన సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మీని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె  కూడా మూడోసారి విజయనగరం ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. ఇక, ఆయన సోదరుడు బొత్స అప్పలనర్సయ్యను గజపతినగరం అభ్యర్థిగా, సోదరుడి వరుసైన బడ్డుకొండ అప్పలనాయుడ్ని నెల్లిమర్ల అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో వీరిద్దరూ ఆ పార్టీ తరఫున రెండో సారి బరిలోకి దిగుతున్నారు.

 బొత్సకు వరసకు బావైన యడ్ల రమణమూర్తిని విజయనగరం అభ్యర్థిగా ఖరారు చేసింది.  ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశంతో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన యడ్ల రమణమూర్తికి ఇటీవల చోటు చేసుకున్న సమైక్యాంధ్ర పరిణామాలు, పార్టీపై వెల్లువెత్తిన వ్యతిరేకత, బొత్స ఫ్యామిలీకి ఎదురైన దెబ్బలను చూసి పోటీ చేసేందుకు వెనుకంజ వేశారు. తనకున్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పోటీ చేయలేనని చెప్పినట్టు కూడా తెలిసింది. కానీ, మరో ప్రత్యామ్నాయం లేదని, గెలుపోటములతో సంబంధం లేదని, తప్పనిసరిగా పోటీ చేయాల్సిందేనని బొత్స సత్యనారాయణ పట్టుబట్టడంతో బలవంతంగా బరిలోకి దిగుతున్నట్టు తెలిసింది.  గతంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన శంబంగి వెంకట చినఅప్పలనాయుడ్ని  బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసింది. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఆయన పోటీకి నిరాకరించినా... పార్టీ నేతల ఒత్తిడి మేరకు అయిష్టంగానే బరిలోకి దిగుతున్నట్టు తెలిసింది. ఇక శృంగవరపుకోట నియోజకవర్గం అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ అనుచరుడు ఇందుకూరి రఘురాజుని ప్రకటించింది. టిక్కెట్ రాకపోవడంతో, బొత్స తెరవెనుక ప్రోద్బలంతో గత ఎన్నికల్లో  ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి జోగినాయుడు ఓటమికి కారకులైన రఘురాజు మరోసారి బరిలోకి దిగుతున్నారు.

కురుపాం, సాలూరుకు కొత్తముఖాలు..
కురుపాం, సాలూరు నియోజకవర్గాలకు కాంగ్రెస్ అధిష్టానం కొత్త ముఖాలను ఎంపిక చేసింది. కురుపాం అభ్యర్థిగా గుమ్మలక్ష్మీపురం ఎల్విన్‌పేటకు చెందిన ఇంద్రసేన్ వర్దన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, మాజీ మంత్రి శత్రుచర్ల విజయమరాజుతో సన్నిహితంగా ఉండే ఎర్రమల్లి వాసుదేవరావు కుమారుడిగా తప్ప ఇంద్రసేన్ వర్దన్‌కు అంతకుమించి రాజకీయ నేపథ్యం లేదు.  సాలూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన హెచ్‌జీబీ ఆంధ్రబాబా మెంటాడ జమీందార్ హరహరిగార ప్రతాప్‌రాజు కుమారుడు. ప్రతాప్‌రాజు గతంలో సమితి అధ్యక్షునిగా, సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈయన బంధువులు ఒడిశాలో కాంగ్రెస్ కీలక నేతలుగా కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
విజయనగరం : యడ్ల రమణమూర్తి
గజపతినగరం : బొత్స అప్పలనర్సయ్య
ఎస్.కోట : ఇందుకూరి రఘురాజు
చీపురుపల్లి : బొత్స సత్యనారాయణ
బొబ్బిలి : శంబంగి వెంకట చిన
అప్పలనాయుడు
కురుపాం : ఇంద్రసేన్ వర్దన్
సాలూరు : హెచ్‌జీబీ ఆంధ్రబాబా
నెల్లిమర్ల : బడ్డుకొండ అప్పలనాయుడు
 

మరిన్ని వార్తలు