బస్సు మిస్సే!

28 Mar, 2014 02:36 IST|Sakshi

సాక్షి, అనంతపురం : పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాలో ఆ పార్టీ బస్సు యాత్ర అనుకున్న రీతిలో ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవిని చూడటానికి వచ్చిన కొద్ది మంది అభిమానులు మినహా కాంగ్రెస్ కార్యకర్తలెవరూ కనిపించలేదు. గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ చంద్రబాబుపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రాణాలు తీసిన వారినే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్కున చేర్చుకుంటున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు పదవీ వ్యామోహంతో విలువలను పక్కన పెట్టి ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకుంటున్నాడని విమర్శించారు.


 కాంగ్రెస్‌లో మొన్నటి వరకు పదవులు అనుభవించిన పెద్ద నాయకులు పార్టీని వదలి పోయారని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. 63 జెడ్పీటీసీ స్థానాలకు గాను 30 మంది, 863 ఎంపీటీసీ స్థానాలకు గాను 214 మంది, 273 మున్సిపల్ వార్డుల్లో 146 చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవితో పాటు మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొండ్రు మురళీ తమ ప్రసంగాల్లో చంద్రబాబు నాయుడు కుర్చీ కోసం విలువలను సైతం పక్కన   పెడుతున్న వైనంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత దూషణలు చేశారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మాంగల్యాన్ని లాక్కొన్న వారినే చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీలో చేర్చుకున్నాడని ఆనం గుర్తు చేశారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని, విభజించాలని లేఖలు ఇచ్చి ఒత్తిడి తీసుకరావడం వల్లే రాష్ట్రాన్ని విభజించాల్సి వచ్చిందన్నారు.


రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్ పాత్ర లేదని నాయకులు చెప్పే ప్రయత్నం చేయగా.. కార్యకర్తలు అడ్డుతగిలారు. మీ ప్రసంగాలు అవసరం లేదంటూ సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో రఘువీరారెడ్డి కలుగ జేసుకొని ఏయ్.. ఏయ్.. నేను చెప్పేది వినండి.. మీ భవిష్యత్తు కోసమే సభ నిర్వహించి వాస్తవాలు తెలియజేస్తున్నామని పలుమార్లు చెబుతూ హెచ్చరించే విధంగా మాట్లాడినప్పటికీ ఆయన మాటలను సైతం ఎవరూ పట్టించుకోలేదు. సభలో జనం కన్పించకపోయినా పెద్ద ఎత్తున తరలివచ్చారని తమ ప్రసంగాల్లో చెప్పుకొన్నారు. కేవలం రాంచరణ్ అభిమానులే కేక్ కట్ చేయించాలని అక్కడికి వచ్చారు. నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో బహిరంగ సభ పేలవంగా కన్పించింది. చిరంజీవి తన ప్రసంగం ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ప్రసంగం మాదిరి కాకుండా ఆయన పుస్తకం చదివినట్లు చదువుకుంటూ పోవడంతో అభిమానులు ఒక్కొక్కరూ వెళ్లిపోయారు.


 తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనుల కోసం తన చుట్టూ తిరిగి ఇప్పుడు కన్పించకుండా పోయారని ఆనం రామనారాయణరెడ్డి  ఆరోపించారు. ఈ సభలో కేంద్ర మంత్రి జేడీ శీలం, రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, మాజీ మంత్రులు బాలరాజు, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే సుధాకర్, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, నాయకులు నాగరాజు, రవీంద్ర, కేటీ శ్రీధర్, దేవమ్మ, దాదా గాంధీ, కేవీ రమణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు