సారీ.. ! టైం లేదు

24 Mar, 2014 02:53 IST|Sakshi
సారీ.. ! టైం లేదు

జోరుగా ‘పుర’పోరు ప్రచారం
ముఖ్యనేతలు మాత్రం దూరం
అసెంబ్లీ టికెట్ వేటలో బిజీబిజీ
గాడ్‌పాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు
ఎన్నికల వేళ అభ్యర్థుల్లో అయోమయం

 
 సాక్షి,మహబూబ్‌నగర్: ప్రస్తుతం జిల్లాలో ని మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి మునిసిపాలిటీతో పాటు నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, కల్వకుర్తి, అయిజ నగర పంచాయతీలకు ఎన్నికలు జ రుగుతున్నాయి. ఈనెల 14 వరకు పుర నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. 18న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు అభ్యర్థులకు గుర్తులు కే టాయించడ ంతో ప్రచారపర్వం కూడా ముమ్మరమైంది. ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం ప్రారంభమై ఐ దురోజులు గడుస్తున్నా..కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీల ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎవరూ ప్రచారంలో పాల్గొనడం లేదు.

కారణమేమంటే వచ్చే నెల 2వ తేదీ నుంచి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తుంచడంతో టికెట్లు దక్కించుకునేందుకు ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు గాంధీభవన్, ఎన్‌టీఆర్ భవన్, తెలంగాణ భవన్.. ఇలా ఆయా పార్టీల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మునిసిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు తమ గెలుపు కోసం అనుచరులతో కలిసి మాత్రమే ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించుకోవాల్సి వస్తోంది. నగర పంచాయతీల్లో అయితే అభ్యర్థులు చోటామోటా నాయకులను తమవెంట తిప్పుకోవాల్సి వస్తోంది.

పుర నామినేషన్ల ఘట్టం మొదలు కాకముందే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గద్వాలలో సభ నిర్వహించి జిల్లాలో లాంఛనంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టివెళ్లారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంఐఎం నేతలు మినహా ప్రధానపార్టీలు నేతలు ఎవరు కూడా జిల్లాలో పర్యటించలేదు. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలో 41 వార్డులు ఉన్నాయి. ప్రచారం ప్రారంభంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు తమ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాత్రం తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం లోపాయికారీగా ప్రచారం కొనసాగిస్తున్నారు.

 ఇక మిగతాపార్టీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. గద్వాలలో టీడీపీ అభ్యర్థుల పక్షాన స్థానిక నేత డీకే సమరసింహారెడ్డి, వనపర్తిలో ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి తమపార్టీ అభ్యర్థుల తరఫున మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నారాయణపేటలో స్థానిక ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన తరువాత ఇప్పటివరకు ఆ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారంలో పాల్గొనలేదు. టీడీపీ అభ్యర్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. కల్వకుర్తిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేసేవారే కరువయ్యారు.

మాజీమంత్రి జె.చిత్తరంజన్‌దాస్, చల్లా వంశీచందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ టికెట్‌ను దక్కించుకునే పనిలో ఉండటంతో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనడం లేదని తెలుస్తోంది.దీంతో స్థానిక నాయకులే ఇంటింటా ప్రచారం నిర్వహించుకుంటున్నారు. అలాగే షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారంలో పాల్గొనలేదు. అయిజ నగరపంచాయతీలో అయితే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చల్లా వెంకట్రామిరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం మధ్య అసెంబ్లీ టికెట్ లొల్లి తారాస్థాయికి చేరడంతో మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను పట్టించుకోవడం లేదు.

 టికెట్ కోసం ప్రదక్షిణలు
 అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న నేతలంతా..ఢిల్లీ, హైదరాబాద్‌లో తమ గాడ్‌పాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఒక్కో నియోజక వర్గం నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు ముగ్గురి నుంచి ఆరుగురు వరకు ఉండగా, మిగతా పార్టీల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ నుంచే పోటీ తక్కువగా ఉందని చెప్పొచ్చు.  
 

మరిన్ని వార్తలు