అంతా హైటెక్ ప్రచారమే

18 Mar, 2014 15:47 IST|Sakshi

సోషల్ మీడియాలో అభ్యర్థుల హల్‌చల్
పీఆర్ ఏజెన్సీలకు పెరిగిన డిమాండ్


ఎన్నికల ప్రచారం గతానికి భిన్నంగా సాగుతోంది. జెండాలు, వాల్‌పోస్టర్లు, వాల్ రైటింగ్, కరపత్రాలు, భారీ కటౌట్ల స్థానంలో తాజాగా కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు హల్‌చల్ చేస్తున్నాయి. కంప్యూటర్ గురించి పెద్దగా తెలియని నేతలు కూడా ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రసంగ పాఠాలతో సోషల్ మీడియా (సెల్‌ఫోన్, ఇంటర్నెట్)ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఓటు ఎందుకు వేయాలో, ఎవరికి వేయాలో సూచిస్తూ ప్రతి రోజూ ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు.

బిజీగా ఫ్లెక్సీ సెంటర్లు..
ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతుండటంతో వాటిని ముద్రించే ఫ్లెక్సీ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. నిన్నమొన్నటి వరకు పనిలేక ఖాళీగా కన్పించిన  ఆర్టిస్టులు, పెయింటర్లు ప్రచార రథాలు, బ్యానర్లు, జెండాలు తయారీలో బిజీగా మారిపోయారు. ప్రచారానికి భారీ కాన్వాయ్‌తో బయలు దేరుతున్నారు. ఇందుకోసం వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు.

రంగంలోకి పీఆర్ ఏజెన్సీలు
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రచార బాధ్యతలను పీఆర్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. గెలుపోటములపై ముందే ఓ అభిప్రాయానికి వచ్చేందుకు అంతర్గత సర్వేలు చేయిస్తున్నారు. ఓటరు నాడి తెలుసుకుని వారికి ఏం కావాలో వాటినే ఎన్నికల ఎజెండాలో రూపొందిస్తున్నారు. బస్తీల వారిగా సమస్యలు, వాటిపై ప్రచారం, మాట్లాడాల్సిన అంశాలపై ముందే ఓ అవగాహనకు వచ్చి ఎజెండాలను రూపొందించి అభ్యర్థులకు అందిస్తున్నాయి.

సాంస్కృతిక బృందాలు..  
కంప్యూటర్ పరిజ్ఞానం లేని, చదువు రాని ఓటర్లను ఆకర్షించేందకు వారికి అర్థమయ్యే రీతిలో అభ్యర్థి గురించి ప్రచారం చేసేందుకు అభ్యర్థులు ఎవరికి వారే స్వతహాగా ప్రత్యేక సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థి గొప్పతనం, ఆయన జీవన శైలి, ఇప్పటి వరకు ఆయన చేసిన సేవ, తదితర అంశాలపై ప్రసిద్ధ రచయితలతో పాటలు రాయించి, ప్రముఖ గాయకులతో పాడిస్తున్నారు. స్టూడియోల్లో వీటిని రికార్డ్ చేయిస్తున్నారు.

సోషల్ మీడియాదే హవా ...
ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల సంయుక్తంగా సోషల్ మీడియాపై ఓ సర్వే నిర్వహించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 160 లోక్ సభ సీట్లను ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా డామినేట్ చేయబోతున్నాయని తేల్చింది. యువతలో దాదాపు 97 శాతం ఫేస్‌బుక్ ఖాతాదారులే. సమయం దొరికితే చాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, బ్లాగ్స్, వెబ్‌సైట్స్, వెబ్‌టీవీ... ఏదో ఒకదానికి కనెక్ట్ అవ్వడం సర్వసాధారణమని వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు