మాటలు మోస్తున్న ‘దేశం’

26 Apr, 2014 04:24 IST|Sakshi
మాటలు మోస్తున్న ‘దేశం’

- డబ్బు పంపిణీకి మార్గం సుగమం చేసుకునే యత్నం
- పోలీసుల కళ్లుగప్పి కాలనీలకు తరలుతున్న రూ.లక్షలు
- ఎన్నికల సమయానికి ఉపయోగించుకునేలా చర్యలు

 
 సాక్షి ప్రతినిధి,  ఒంగోలు, సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఎన్నికల సమయానికి నగదు పంపిణీ చేపట్టేందుకు ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున చిన్న చిన్న మొత్తాలను  ఆయా ప్రాంతాలకు తరలిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీలకు వెళుతూ, వెనుక కారులో ఉన్న నగదును ఆయా కాలనీల్లో తెలుగుదేశం నాయకుల ఇళ్లకు తరలిస్తున్నారు.

అభ్యర్థులకు ఏర్పాటు చేసిన షాడో పార్టీ కళ్లుగప్పి, ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. శుక్రవారం కూడా ఒక ప్రముఖ నాయకుడు నగర  శివారు ప్రాంతానికి ప్రచారానికి వెళ్లారు. ఆయనతోపాటు వెనుక వచ్చిన కారులో భారీ మొత్తాన్ని తరలించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఆ కాలనీలో తెలుగుదేశం నాయకుడి ఇంట్లో దాచినట్లు తెలిసింది.  ఒక కాలనీలో వంద ఓట్లు  ఉంటే, దానికి తగిన విధంగా మొత్తాన్ని  సిద్ధం చేసి, ఆ మొత్తాన్ని కాలనీలోని ఒక నాయకుడి ఇంటికి పంపుతున్నారు.

ఎన్నికల సమయంలో ఆ నగదు పంచిపెట్టే బాధ్యతను కూడా ఆ నాయకుడికే అప్పగిస్తున్నారు. ఈ విధమైన వ్యూహాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ పనులు చేపడుతున్నారు. ఎంపీ అభ్యర్థులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది. అదే విధంగా మద్యం పంపిణీకి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏదైనా ఎక్కువ మొత్తంలో ఉంటే పోలీసులు పట్టుకునే ప్రమాదం ఉంది కనుక, తక్కువ మొత్తంలో  ఎక్కువ ప్రాంతాలకు త రలిస్తున్నారు.

 ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వాలనుకున్నా, వంద ఓట్లకు లక్ష రూపాయలు సరిపోతాయని, ఒక  ఇంట్లో లక్ష రూపాయలు ఉండటం పెద్ద నేరంగా పరిగణింపబడదని వీరు వాదిస్తున్నారు. అదే  తీరులో డబ్బులు చేరవేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా మద్యం కూడా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. మద్యం బాటిళ్లను  ఒక కాలనీలోని ఇద్దరు, ముగ్గురు ఇళ్లకు చేరుస్తున్నారు. భారీగా ఉంటే సమస్య  ఉంటుందని, తక్కువ మోతాదులో ఎక్కువ ప్రాంతాలకు తరలించడం వల్ల పోలీసులు పట్టుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నా, కాన్వాయ్‌లోఉన్న వాహనాలను వదిలి పెడుతున్నారు.

  ఇదే అదనుగా తీసుకుని తెలుగుదేశం నాయకులు ఇటువంటి పనులు చేస్తున్నారు. భారీగా తరలించడం వల్ల పోలీసులకు సమాచారం అందుతుందని, దీంతో వారు దాడులు చేసి పట్టుకునే అవకాశం ఉందని, తక్కువగా రవాణా చేయడం వల్ల ఎవరికీ అనుమానం రాదని, ఈ మార్గాన్ని అధిష్టానం సూచనల మేరకు అనుసరిస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు తెలిపారు.

>
మరిన్ని వార్తలు