టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే: జైరాం రమేష్

30 Apr, 2014 22:33 IST|Sakshi
టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే: జైరాం రమేష్

కర్నూలు: ‘తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. టీడీపీకి మరో పేరు బీజేపీ. చంద్రబాబు ఇంటి పేరు నారా కాదు నరేంద్ర’ అని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. బుధవారం కర్నూలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు స్వార్థపరులు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరుతున్నారని.. వీరు తమ వ్యాపారాలను కాపాడుకునేందుకే పార్టీని వీడుతున్నారన్నారు. ఇలాంటి వారు వెళ్లిపోవడంతో కాంగ్రెస్‌కు విముక్తి లభించినట్లయిందన్నారు.

దళిత, ఆదివాసీ, బీసీ, మైనారిటీ తదితర అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. దళిత నేత సంజీవయ్య ముఖ్యమంత్రి కావడమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఒక్క సీపీఎం తప్ప మిగతా అన్ని పార్టీల నాయకులు తెలంగాణపై రాతపూర్వక అంగీకారం తెలపడంతోనే రాష్ట్రాన్ని సోనియా విభజించారన్నారు. విభజనతో సీమాంధ్రకు ఎలాంటి నష్టం ఉండబోదన్నారు.

కృష్ణా, గోదావరి రివర్ బోర్డులు కేంద్రం ఆధీనంలో ఉన్నాయని.. వీటికి చైర్మన్లను కూడా కేంద్రమే నియమిస్తుందన్నారు. ఫలితంగా నీటి పారుదల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవన్నారు. సీమాంధ్రలో రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించామని.. ఐదేళ్లలో దాదాపు రూ. 12 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగుతాయని.. బీసీలకు, మైనారిటీలకు కూడా సబ్‌ప్లాన్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు