పొత్తు కోరింది..బాబే

6 Apr, 2014 02:52 IST|Sakshi
పొత్తు కోరింది..బాబే

గౌరిభట్ల నరసింహమూర్తి


 బీజేపీతో పొత్తు కోరుకున్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని, తాము కాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేసేందుకు సమాయత్తమయ్యామని, అయితే, అనూహ్యంగా పొత్తు కుదిరిందన్నారు. వ్యక్తిగతంగా పొత్తును వ్యతిరేకించినా, పొత్తుపై తమ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానన్నారు. టీడీపీతో పొత్తుపై కినుక వహించిన కిషన్‌రెడ్డి, ఎన్నికల్లో పోటీ చేయనంటూ అలకపాన్పు ఎక్కినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ‘పొత్తు’పై ఆయన ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. విశేషాలివీ...


 నరేంద్ర మోడీ ప్రధాని కావాలని దేశమంతా ఎదురు చూస్తోందని, మన రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని, ఇక్కడి నుంచి ఎక్కువ స్థానాలను గెలిచి కానుకగా ఇస్తామని మోడీకి స్పష్టం చేశామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎక్కువ స్థానాలు గెలవాలంటే మరో పార్టీతో పొత్తు ఉండాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
 
 దేశవ్యాప్తంగా ఉన్నట్లే తెలంగాణలోనూ మోడీ ప్రభావం ఉందని, అది బీజేపీ సొంతంగా కూడగట్టుకున్న శక్తి అని చెప్పారు. పార్టీ విస్తృత ప్రయోజనాల రీత్యా అటు సీమాంధ్రలోను, ఇటు తెలంగాణలోను టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిపారు. నిజానికి సీమాంధ్రలోనే పొత్తుకు ప్రాధాన్యం ఉందని, సీమాంధ్రలో పొత్తు పెట్టుకుకుని, తెలంగాణలో లేకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో రెండు చోట్లా పొత్తు ఉండాలని చంద్రబాబుతో పాటు తమ పార్టీ అగ్రనేతలు నిర్ణయించినట్లు కిషన్‌రెడ్డి వివరించారు.
 
 సొంతబలాన్ని పెంచుకోవాలన్నదే నా ఉద్దేశం...
 
 వేరే పార్టీలతో జతకట్టడం వల్ల గతంలో బీజేపీ నష్టపోయిందని, అలా కాకుండా సొంత బలాన్ని పెంచుకోవాలన్నదే తన ఉద్దేశమని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలుగుదేశంతో పొత్తు విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని అధిష్టానానికి వెల్లడించానని, అయితే, పార్టీ విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తు అవసరమన్న అధిష్టానం అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు. పొత్తు విషయంలో ఇప్పుడు తనకు చెడు అభిప్రాయమేమీ లేదన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల కంటే ఎక్కువ సీట్లే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే, సీట్ల సర్దుబాటు వల్ల కొన్ని త్యా గం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ బలంగా ఉన్నా, పొత్తు కారణంగా గతంలో శివసేనకు ఎక్కువ స్థానాలు ఇచ్చామని, ఇక్కడా అలాంటి పరిస్థితే ఉందని చెప్పారు. పొత్తు ఉన్నా, ఎక్కువ స్థానాల్లో బీజేపీనే పోటీలో ఉండాలనే కోరిక నెరవేరకపోవడం మాత్రం బాధాకరమన్నారు.
 
 ఫలితాల తర్వాత పరిస్థితులకు తగ్గట్టుగా...
 
 కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు మెజారిటీ రాదని, బీజేపీ-టీడీపీ కూట మికే అవకాశం ఉంటుందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఒకవేళ పూర్తి మెజారిటీ రాకుంటే, అప్పటి పరిస్థితులకు తగట్టుగా, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటామన్నారు. అధిష్టానం అంగీకరిస్తే, టీఆర్‌ఎస్‌తో కలసి ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకొస్తామని చెప్పారు. మరో ఇరవై రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడుతుందన్నారు. మోడీ ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేయనున్నారని, ఆయన ప్రచారం మొదలవగానే కాంగ్రెస్ పతనం ప్రారంభమవుతుం దని అన్నారు.
 
 అంబర్‌పేట నుంచి పోటీ చేస్తానని ఇదివరకే అధిష్టానానికి చెప్పానని, తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానం ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. అసలు పోటీ చేయనన్నట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా, తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవేనని, తాను పోటీ చేయడం కంటే పది జిల్లాల్లోనూ తిరిగి ప్రచారం చేయడమే మంచిదనిపించి, అధిష్టానంతో అలా చెప్పానన్నారు. అయితే, అధిష్టానం ఆదేశం మేరకే నడుచుకుంటానని చెప్పారు.
 
 
 సొంతంగానే వెళ్లాలనుకున్నాం.. కానీ!
 
 బీజేపీతో పొత్తు కోరుకున్నది చంద్రబాబేనని, తాము కోరలేదని కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీతో జతకట్టడం తప్పుగా భావించిన బాబే ఈసారి తమతో పొత్తుకు సిద్ధమయ్యారంటే గతంలో చేసిన ఆరోపణలను బేషరతుగా ఉపసంహరించుకున్నట్లుగా ఆయన అంగీకరించినట్లేనన్నారు. ఈ విషయంలో తాము ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీతో దోస్తీపై ప్రజలు నిలదీయరా అన్న ప్రశ్నకు బదులిస్తూ, తెలంగాణ సిద్ధించిందని, ఇకపై తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి జరగాల్సి ఉందని, తమ పార్టీ ఆ దిశగానే కృషి చేస్తోందని చెప్పారు. నిజానికి ఈసారి సొంతంగానే పోటీకి వెళ్లాలనుకున్నా, అనూహ్యంగా పొత్తుకు సిద్ధపడ్డామన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం సొంత కాళ్లపై నిలబడే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వస్తామని అన్నారు. తమ పార్టీ పాలనలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా గుర్తిస్తోందని, అలాంటి అభివృద్ధినే కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు 2019 ఎన్నికల నాటికి తమకే పట్టం కడతారని అన్నారు. మేనిఫెస్టోలు చూసి ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదని, నిజంగా అభివృద్ధి చేసి చూపాలన్నారు. గుజరాత్‌లో మోడీ అభివృద్ధిని చేసి చూపారన్నారు. అందుకే తమ మేనిఫెస్టోలో మోడీయిజం గురించి ప్రస్తావిస్తున్నామన్నారు. అభివృద్ధితో పాటు నిజాయితీ, సమర్థత నినాదాలుగా ప్రజల్లోకి వెళతామన్నారు.


 

మరిన్ని వార్తలు