మోత్కుపల్లి నర్సింహులు కూరలో కరివేపాకేనా?

22 Apr, 2014 17:16 IST|Sakshi
మోత్కుపల్లి నర్సింహులు కూరలో కరివేపాకేనా?

కూరలో కరివేపాకు... టీడీపీలో ఆ మాట మోత్కుపల్లి నరసింహులుకు బాగా అతుకుతుంది. కేసీఆర్ ను తిట్టాలంటే చంద్రబాబుకు మోత్కుపల్లి గుర్తుకు వస్తారు. ఎన్నికలప్పుడు టికెట్ ఇవ్వాలంటే మోత్కుపల్లి గుర్తకురారు. ఓడ దాటే దాకా ఓడ మల్లయ్య. ఓడ దాటిన తరువాత బోడ మల్లయ్య. పాపం మోత్కుపల్లితో చంద్రబాబు ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆదరించిన ఆలేరు ఓటర్లు 2004లో మోత్కుపల్లిని తిరస్కరించారు. ఆ తరువాత 2009 లో ఆలేరులో పోటీ చేద్దామంటే అది జనరల్ నియోజకవర్గం అయింది. దీంతో మోత్కుపల్లి వేరే నియోజక వర్గం వెతుక్కుని, తుంగతుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు.

ఈ మధ్య ఆయన రాజ్యసభ రూటులో ఢిల్లీకి వెళ్దామనుకున్నారు. చివరి దాకా ఊరించిన చంద్రబాబు చివరికి తుస్సుమనిపించారు. మోత్కుపల్లి అప్పట్నుంచీ అలకపూనారు.
ఇంతలోనే ఎన్నికలు ముంచుకురావడంతో మోత్కుపల్లి అసెంబ్లీ సీటు కోసం పోటీ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే తుంగతుర్తిలో వోటర్లు ఆయనపై కోపంగా ఉన్నారు. అక్కడ పోటీ చేస్తే గెలవడం కష్టం అనిపించింది. దీంతో ఆయన ఖమ్మం జిల్లా మధిరకు మారిపోయారు . నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా   2009లో మధిర ఎస్సీ రిజర్వుడ్‌గా మారిపోయింది.  

మధిరలో సీపీఎంకు గట్టి పట్టుంది. గతంలో కొద్ది తేడాతో ఓడిపోయినసీపీఎం అభ్యర్థి లింగాల కమల్ రాజ్ ఈ సారి మళ్లీ పోటీ పడుతున్నారు. పైగా ఇక్కడి నుంచే డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క కూడా పోటీ పడుతున్నారు.

మధిరలో మన మోత్కుపల్లికి లక్ కలిసొస్తుందా? ఆయన గెలుపు సాధించగలరా? మధిరలో ఇప్పటివరకూ 13 సార్లు ఎన్నికలు జరిగితే, కార్గిల్ వేవ్ పుణ్యమా అని ఒక్క 1999 లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఈ సారి మోత్కుపల్లి నరసింహులు చరిత్రను తిరగరాయగలరా? బిజెపికి ఏ హవా లేని మధిరలో, బిజెపి పొత్తుతో గట్టెక్కగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

మరిన్ని వార్తలు