పవన్ ఎఫెక్ట్ పని చేసిందా?

14 Apr, 2014 12:57 IST|Sakshi
పవన్ ఎఫెక్ట్ పని చేసిందా?

విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ విషయంలో సినీనటుడు పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ బాగా పని చేసినట్లు కనిపిస్తోంది. దాంతో పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టించి తీరా ఎన్నికలు వచ్చేసరికి  కేశినేని నానిని టీడీపీ అధ్యక్షుడు కూరలో కరివేపాకులా పక్కన పడేశారు. పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కు బెజవాడ ఎంపీ టికెట్ ఖరారు అయినట్లు సమాచారం.

ఇటీవల జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న క్రమంలో విజయవాడ ఎంపీ సీటు తన సన్నిహితుడు పొట్లూరికే ఇవ్వాలంటూ పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నాడు. తాను సూచించిన పొట్లూరికి సీటిస్తే ప్రచారం చేస్తానని పవన్ ఖరాఖండిగా చెప్పడంతో బాబు... కేశినేని నానికి పక్కన పెట్టినట్లు సమాచారం. తనకు ఎంపీ టికెటే కేటాయించాలని కేశినేని నాని...అధినేతను కలిసినా ఫలితం దక్కలేదు. ఎంపీ సీటుపై పట్టు వద్దంటూ విజయవాడ తూర్పు, పెనమలూరు అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి తీసుకోవాలంటూ చంద్రబాబు ఈ సందర్భంగా నానికి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు టీడీపీలో విజయవాడ ఎంపీ సీటు కోట్లు పలుకుతోంది. ఎన్.ఆర్.ఐ. కోమటి జయరాం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమేనని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం చైర్మన్ కోనేరు సత్యనారాయణ అదే బాటలో ఉన్నారు. పారిశ్రామికవేత్త పొట్లూరు వరప్రసాద్  నిధులకు వెనుకాడకుండా ఖర్చుచేస్తానని చెప్పడంతోపాటు సినీనటుడు పవన్‌కల్యాణ్‌తో సిఫారసు చేయించారు. ఇక ఎంపీ సీటుపై గంపెడంత ఆశ పెట్టుకున్న కేశినేని నానికి బాబు మొండి చేయి చూపించటంతో...నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఎంపీ సీటు ఆశిస్తున్న కోనేరు సత్యనారాయణ, పీవీపీలు ఇంటర్నేషనల్ స్కామర్లు అంటూ కేశినేని నాని  వ్యాఖానించటం పార్టీలో సంచలనం కలిగింస్తోంది. ఇప్పటికే కార్పొ'రేట్' సంస్థగా టీడీపీ మారిపోయిందని, తాజాగా సీట్లు ఆశిస్తున్న మరో ఇద్దరినీ స్కామర్లుగా ఆ పార్టీ నేతే ముద్ర వేయటంతో టీడీపీ ప్రతిష్ట రోడ్డున పడినట్లయింది.

మరిన్ని వార్తలు