కేసీఆర్.. తేల్చుకుందాం రా!

28 Apr, 2014 02:34 IST|Sakshi
ఆదివారం బోధన్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న చంద్రబాబు

- తెలంగాణ అభివృద్ధి ఎవరు చేశారో!  
- బోధన్, జగిత్యాల, కందుకూరు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు


 బోధన్, కందుకూరు, న్యూస్‌లైన్/సాక్షి, కరీంనగర్: తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందాం రమ్మని టీడీపీ అధినేత చంద్రబాబు కేసీఆర్‌కు సవాల్ విసిరారు. బోధన్ వేదికగా ఇందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బోధన్, కరీంనగర్ జిల్లా జగిత్యాల, రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన బహిరంగ సభలలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అధినేతపై నిప్పులు చెరిగారు.  కేసీఆర్ తెలంగాణ ద్రోహి, మోసకారి, అబద్ధాలకోరు, తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం పాటు పడని ఆయనకు ఓట్లడిగే హక్కు లేదని విమర్శించారు.

అబద్ధాలు మాట్లాడటం, పెద్ద, చిన్న తేడాలేకుండా, బండ మాటలు మాట్లాడటం ఆయనకు అలవాటై పోయిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ అని, ఎప్పటికైనా అమ్ముడుపోయే సరుకని ధ్వజమెత్తారు. ఆపార్టీలో మంచోళ్లు ఉండరని, 420లే ఉంటారని పేర్కొన్నారు. దొంగ కేసీఆర్‌తో బతుకులు ఆగమవుతాయని, సమాజహితం కోసం మేం ఆలోచిస్తుంటే, కేసీఆర్ మాత్రం తన కుటుంబం కోసం ఆలోచిస్తున్నాడని విమర్శించారు.  

నన్నే జైలుకు పంపుతానంటావా?

‘‘నిజాం షుగర్స్ ప్రయివేటీకరణపై నన్నే జైలుకు పంపుతానంటావా... నా స్థాయి ఏమిటో తెలియకుండా అంటావా’’ అంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు.  కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపినా తనను ఏమీ చేయలేక పోయిందన్నారు. ‘‘ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. నీవు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపి, నిన్ను నీ కుటుంబ సభ్యులందరినీ శాశ్వతంగా జైలులో పెడతా’’ అని హెచ్చరించారు.

 తన జోలికి వస్తే ఊరుకోబోనని, సైకిల్ జోరు పెంచి చక్రాల కింద తొక్కిస్తానన్నారు. ‘కేసీఆర్ తన ఫాం హౌజ్‌లో కూర్చొని అవినీతి పంట పండిస్తాడు.. ఎకరానికి రూ.కోటి చొప్పున పండిస్తాడు.. మాట్లాడితే ఎదురుదాడికి దిగుతాడు’ అని మండిపడ్డారు. ‘2004 ఎన్నికల్లో కరీంనగర్, 2009లో మహబూబ్‌నగర్, ఇప్పుడేమో మెదక్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నావ్. నువ్వో వలస పక్షివి’ అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.
 
 సభలు ఆలస్యం...ప్రజల అసహనం

 ఉదయం 10.45గంటలకు బోధన్ రావలసిన చంద్రబాబు నాలుగు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.45కు వచ్చారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్జిగ పంపిణీలో గందరగోళం ఏర్పడటంతో పోలీసులు జనాన్ని చెదరగొట్టారు. సభ అనంతరం నిర్వాహకులు మహిళలకు డబ్బులు పంపిణీ చేయడం కనిపించింది.

మరిన్ని వార్తలు