టీఆర్‌ఎస్ అభ్యర్థికి అమ్ముడుపోయాడు

11 May, 2014 00:33 IST|Sakshi
టీఆర్‌ఎస్ అభ్యర్థికి అమ్ముడుపోయాడు

 చింతలపై రాజగోపాల్‌రెడ్డి పరోక్ష ఆరోపణ
 
 భువనగిరిటౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయకుండా, టీఆర్‌ఎస్ అభ్యర్థి వద్ద డబ్బు తీసుకొని అమ్ముడుపోయాడని పీసీసీ మాజీ సభ్యుడు చింతల వెంకటేశ్వరరెడ్డిపై  ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరోక్షంగా ఆరోపించారు. భువనగిరి పట్ట ణంలోని వివేరా హోటల్‌లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ అభ్యర్థుల నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు తనకు టిక్కెట్ రాకుండా ఎంత ప్రయత్నించినా అది ఫలించలేదన్నారు.

తాను గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. 2009లో జరిగిన ఎన్నికల్లో చింతల వెంకటేశ్వరరెడ్డి గెలుపు కోసం తాను కృషి చేశానన్నారు. రెండుసార్లు పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ వస్తే ఆయన గెలుపుకోసం చిం తల కృషి చేయలేదని అన్నారు. ఎన్ని కల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయనను తాను ఫోన్‌లో కోరానని, అయినా చింతల పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం సిగ్గుచేటన్నారు. ప్రాదేశిక, మున్సిపల్ ఫలితాలు అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్మన్, నాలుగు మండలాల ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు పార్టీకి చిత్తశుద్ధి ఉన్నావారే ఎన్నికయ్యేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.
 
 అనంతరం అసెంబ్లీ అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీ నుంచి తరిమికొట్టాలన్నారు. భువనగిరి నియోజక వర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన చింతల వెంకటేశ్వరరెడ్డిపై టీపీసీసీకి, రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అలాంటి వారిని జీవిత కాలం పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చేనెలలో బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అనంతరం టీపీసీసీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు బొల్లు కిషన్ మాట్లాడారు. నియోజకవర్గం నుంచి అందిన నివేదిక ఆధారంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య, పార్టీ క్రమశిక్షణ సంఘం నాయకుడు కోదండరాంరెడ్డికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు బర్రె జహంగీర్, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, పెంట నర్సింహ, నానం కృష్ణ, జనార్దన్‌రెడ్డి, శివశాంతిరెడ్డి, రమేశ్, సత్తిరెడ్డి, బెండలాల్‌రాజ్, ఈరపాక నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు