చిరంజీవిని చూసేందుకే వచ్చారు

28 Mar, 2014 03:03 IST|Sakshi

కాంగ్రెస్ సభకు హాజరైన విద్యార్థులు పరీక్ష రాసేసి అటుగా వచ్చారు


 అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు విద్యార్థులే అధికంగా హాజరయ్యారు. సభా వేదికకు సమీపంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ, జూనియర్ కళాశాలలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. సమావేశం ప్రారంభమయ్యే సమయానికి పరీక్ష పూర్తి కావడంతో, విద్యార్థులందరూ నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభలో నేతలు ప్రసంగిస్తుండగా వద్దు వద్దంటూ కేకలు వేశారు. చిరంజీవి పేరును ఉచ్ఛరించినప్పుడల్లా కేకలు వేసిన విద్యార్థులు, ఆయనను మాట్లాడించాలని డిమాండ్ చేశారు.

 చిరంజీవి ప్రసంగించే సమయంలో పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. చివరికి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ చిరంజీవిని ఎంత సేపు మీ ముందు ఉంచాలో మీరే చెప్పండి. ఆయన ముందు మాట్లాడితే సభ ముగిసిపోతుంది. ఆయన వెళ్లి పోతారు. అలా కాకుండా మీరు ఆయనను ఎక్కువ సేపు చూడాలనుకుంటే మా అందరి తరువాత చివరలో మాట్లాడతారు. అలాగైతే మీరు ఆయనను ఎక్కువ సేపు చూసే అవకాశం ఉంటుందని చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
 
 పరీక్ష వేళలో... కాంగ్రెస్ సభ
  డిగ్రీ విద్యార్థులకు 11 గంటల వరకూ, పదవ తరగతి విద్యార్థులకు  12 గంటల వరకు పరీక్షలు జరుగుతుండగా గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్‌పార్టీ సభ ఏర్పాటు చేసింది. సభా వేదికకు ఒకవైపున డిగ్రీ పరీక్ష కేంద్రమైన ఆర్ట్స్ కళాశాల, సభకు ఎదురుగా పదవ తరగతి పరీక్షా కేంద్రమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నాయి.  ఉదయం 9 గంటల నుంచి సభా ప్రాంగణంలో హడావుడి మొదలైంది. భారీ స్పీకర్లు ఏర్పాటు చేసి పాటలు వినిపించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. మైకుల హోరుకు సరిగ్గా పరీక్ష రాయలేకపోయామని, అటుగా వచ్చిన పలువురు విద్యార్థులు బాధపడ్డారు.

మరిన్ని వార్తలు