‘భీ’ ఫారాల లొల్లి

25 Mar, 2014 03:25 IST|Sakshi

 జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: బీ ఫారాలు ఇవ్వలేదని అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సోమవారం నామినేషన్ల ఉప సంహరణకు చివరిరోజు  కావడంతో జెడ్పీ, ఎంపీటీసీలు పోటీ చేస్తున్న అభ్యర్థుల బీఫారాల కోసం బాహాబాహీకి దిగారు. వంగూరు జెడ్పీటీసీ స్థానం టీఆర్‌ఎస్ బీఫారంపై వివాదం రచ్చరచ్చ జరిగింది. జెడ్పీటీసీగా నామినేషన్ వేసిన కరాటే రాజుకు అచ్చంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గువ్వల బాలరాజుపై దాడికి యత్నించారు.

 

బీఫామ్ నీకేంది ఇచ్చేదని తోసిపారేశారు. నన్ను చంపుతున్నారని కరాటే రాజు కేకలు వేయడంతో అక్కడ ఉన్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. రాజును పోలీసులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాజు మాట్లాడుతూ బీఫామ్ త నకే ఇస్తానని చెప్పి నామినేషన్ వేయించారని, తీరా బీఫామ్ ఇచ్చే సమయంలో వేరే వ్యక్తికి ఇచ్చారని మండిపడ్డారు. ఓయూలో తాను చేస్తున్న ఉద్యోగానికి సైతం రాజీనామా చేయించి... ఇప్పుడు గువ్వల బాల్‌రాజు మోసం చేశారని ఆరోపించారు. ఉదయం వరకు తనకే టిక్కెట్ ఇస్తానని చెప్పి... పూల్‌సింగ్‌కు టికెట్ ఇవ్వడం సరికాదన్నారు.


  బీఫాం చింపే ప్రయత్నం...
 కొత్తూర్ మండల జెడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ తరుఫున నామినేషన్ వేసిన సత్యయ్యకు ఇచ్చిన బీఫాంను ఏనుగ మహీందర్‌రెడ్డి చింపే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న సత్యయ్య తరుఫున ఉన్న వ్యక్తులు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి బీఫాం ఉన్న సత్యయ్యను నామినేషన్ కేంద్రంలోకి పంపించారు.  


 ఒకే స్థానానికి ఇద్దరికి బీఫారాలు
 ధన్వాడ: ధన్వాడ-3 ఎంపీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా నీరటి నర్సింహులు నాయుడు, బోయ బాల్‌రాజులకు  బీఫారాలు జారీ చేయడంతో ఇరువురు తమదే ఆమోదించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సక్రియానాయక్‌తో వాగ్వివాదానికి దిగారు. నర్సింహులునాయుడుకు రెండురోజుల క్రితమే జిల్లా అధ్యక్షులు విఠల్‌రావు ఆర్య నుంచి పార్టీ బీఫారం పొంది ఎన్నికల అధికారికి అందజేశారు.

సోమవారం శివకుమార్‌రెడ్డి వర్గానికి చెందిన బోయ బాల్‌రాజు మరో బీఫారాన్ని తెచ్చి ఎన్నికల అధికారికి ఇచ్చారు. దీంతో ఎవరిని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించాలో తెలియక ఎన్నికల అధికారి సందిగ్ధంలో పడిపోయారు.ఈ విషయంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సక్రియానాయక్ ‘పేట’ ఆర్డీఓ మోహన్‌రెడ్డి, సీఈఓతో చర్చించి...బాల్‌రాజుకు ఇచ్చిన బీఫారంలో సబ్‌స్ట్యూట్ అని సూచించలేకపోవడంతో మొదట బీఫారం తెచ్చిన నర్సింహులు నాయుడిని టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బాల్‌రాజును స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు