గుర్తు.. గుబులు

25 Apr, 2014 01:09 IST|Sakshi
గుర్తు.. గుబులు

దేవరకొండ నియోజకవర్గంలో కామన్ ‘కొడవలి’ తెచ్చిన తంటా
ఇద్దరు అభ్యర్థుల పేర్లు మొదటి అక్షరం ‘ఆర్’

 
దేవరకొండ, న్యూస్‌లైన్,దేవరకొండలో సీపీఐ పార్టీకి గుర్తు గుబులు పట్టుకుంది. సీపీఎం పార్టీకి సుత్తి కొడవలి,  సీపీఐ పార్టీకి కంకి కొడవలి గుర్తు కాగా కామన్ కొడవలి వారిని బెంబేలెత్తిస్తోంది. ఈ గుర్తులు చూడ్డానికి ఒకే రకంగా ఉండడం, రెండింటిలోనూ కొడవలి కామన్‌గా ఉండడంతో చాలా మంది తికమకకు గురవుతుంటారు.

ఇదిలా ఉంటే ఇక్కడ ఎక్కువగా సీపీఎం పోటీ చేయలేదు. ఈ సారి సీపీఐ తరఫున మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, సీపీఎం తరఫున రవినాయక్‌లు పోటీ చేస్తుండడంతో ఈ తంటా వచ్చిపడింది. దీనికి తోడు ఇద్దరి పేర్లు ‘ఆర్’ అనే అక్షరంతోనే మొదలు కావడంతో ఈ రెండు గుర్తులు కూడా ఈవీఎం మిషన్‌లో దగ్గరి దగ్గరిగా ఉన్నా యి. దీంతో వృద్ధులు, గుర్తుల పట్ల అవగాహన లేని వారు తికమకకు పడడం వల్ల ఓట్లు తారుమారయ్యే అవకాశముం దని విశ్లేషకులు భావిస్తున్నారు.

దేవరకొండలో ఇప్పటి వరకు ఐదుసార్లు గెలుపొందిన సీపీఐ ఆరోసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుం డగా ఆ ప్రయత్నానికి గండి కొట్టేందుకే సీపీఎం కావాలని అభ్యర్థిని బరిలో ఉం చిందని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ అభ్యర్థి రవీంద్రకుమార్ ఆరోపిస్తున్నారు. గుర్తుల పట్ల అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తూ ఆయన ప్రతి సమావేశంలోనూ తనను గెలిపించడానికి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేయాలని, గుత్తా సుఖేందర్‌రెడ్డి చేయి గుర్తుకు ఓటు వేయాలని స్పష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 దీనికి తోడు ప్రతి సమావేశంలోనూ సీపీఎం కుట్ర పన్నిందని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో అతి తక్కువ ఓట్లున్న సీపీఎం నామినేషన్ వేయడం వెనుక వేరే ఉద్దేశం ఉందని, ఓటర్లను తికమక పెట్టేందుకే ‘ఆర్’ అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తిని బరిలో ఉంచారని ఆరోపిస్తున్నారు.

సీపీఎం కూడా పట్టణంలో విసృ్తత ప్రచారం నిర్వహిస్తోంది. రవీంద్రకుమార్ ఆరోపిస్తున్నట్లు సీపీఐ ఓట్లకు గండి కొట్టడానికి సీపీఎం చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ప్రభావం చూపుతాయో అనేది ఎన్నికల తర్వాత గాని తెలియదు.

మరిన్ని వార్తలు