ఆర్థిక అజెండాలో తేడా లేదు!

8 Apr, 2014 02:24 IST|Sakshi
ఆర్థిక అజెండాలో తేడా లేదు!

కాంగ్రెస్, బీజేపీల మేనిఫెస్టోల్లో దాదాపు ఒకే రకమైన హామీలు
ఒక్క రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ పైనే భిన్నస్వరాలు

 
 న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల ఆర్థిక అజెండాల్లో.. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల విషయంలో మినహా పెద్ద తేడా ఏమీ లేదు. అభివృద్ధిని పెంపొదిస్తామని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తామని, ఉద్యోగాలు సృష్టిస్తామని, పన్ను వ్యవస్థను సంస్కరిస్తామని, పెట్టుబడుదారులకు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తామని రెండు పార్టీలూ తమ మేనిఫెస్టోల్లో హామీలిచ్చాయి. ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేందుకు, ఉద్యోగాల సృష్టికి.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లను రిటైల్ రంగం మినహా అన్ని రంగాల్లోనూ ఆహ్వానిస్తామని బీజేపీ సోమవారం విడుదల చేసిన తన మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే.. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. వ్యవసాయ ఆర్థికవ్యవస్థను మార్చివేస్తుందని, రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని కాంగ్రెస్ చెప్పింది.
 
 ఎఫ్‌డీఐకి అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని స్థిరంగా కొనసాగించటానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక పన్ను సంస్కరణలకు సంబంధించి.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సరుకులు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని తీసుకువస్తామని బీజేపీ, కాంగ్రెస్ రెండూ హామీ ఇచ్చాయి. ఇక ఆదాయ పన్ను చట్టం స్థానంలో ప్రతిపాదిత ప్రత్యక్ష పన్నుల నియమావళి (డీటీసీ)ని ఏడాది కాలంలో తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే.. బీజేపీ దీని గురంచి మాట్లాడలేదు కానీ పన్ను వ్యవస్థను హేతుబద్ధీకరణ, సులభీకరణ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పింది. వచ్చే పదేళ్లలో పది కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, ఆర్థికవ్యవస్థను తిరిగి 8 శాతం వృద్ధి రేటు బాటపట్టిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే.. సంఖ్యల జోలికి వెళ్లకుండానే ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. పట్టణ మౌలిక నిర్మాణాలను మెరుగుపరచే విషయమై.. 100 పట్టణ ప్రాంత సముదాయాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్తే.. అదే సంఖ్యలో నగరాలను నిర్మిస్తామని బీజేపీ చెప్పింది.  
 
 కీలకాంశాలపై కాంగ్రెస్ - బీజేపీ మేనిఫెస్టోలు ఏం చెప్తున్నాయంటే...

మరిన్ని వార్తలు