కల్వకుర్తి కాంగ్రెస్‌దే..

20 May, 2014 01:47 IST|Sakshi
కల్వకుర్తి కాంగ్రెస్‌దే..

 బీజేపీ అభ్యర్థిపై 78 ఓట్లతో గెలిచిన వంశీచంద్‌రెడ్డి
 
 కల్వకుర్తి, న్యూస్‌లైన్: ఈవీఎంలో సాంకేతిక లోపంతో నెలకొన్న మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి విజేత ఎవరో తేలిపోయింది. హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి టి.ఆచారిపై 78 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సోమవారం వెల్దండ మండలం జూపల్లి గ్రామంలోని 119వ పోలింగ్‌బూత్‌లో జరిగిన రీపోలింగ్ విజేతను నిర్ణయించింది. ఈ బూత్ పరిధిలో వంశీచంద్‌రెడ్డికి 328 ఓట్లు, ఆచారికి 450, టీఆర్‌ఎస్ అభ్యర్థి జి.జైపాల్‌యాదవ్‌కు 55 ఓట్లు పడ్డాయి.

ఈనెల 16న సాధారణ ఎన్నికల లెక్కింపు సందర్భంగా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జూపల్లి గ్రామ 119వ పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఈవీఎం సాంకేతిక లోపంతో ఫలితాన్ని చూపలే కపోయింది. దీంతో ఫలితాన్ని నిలిపివేశారు. సోమవారం ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు. రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లను లెక్కించారు. తర్వాత చల్లా వంశీచంద్‌రెడ్డిని విజేతగా ప్రకటించారు. కాగా, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,61,799 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి 42,782 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి టి. ఆచారికి 42,704 ఓట్లు వచ్చాయి. 29,844 ఓట్లతో ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి జి.జైపాల్‌యాదవ్ మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డికి 13,818, స్వతంత్ర అభ్యర్థి కె.నారాయణరెడ్డికి 24,095 ఓట్లు పోలయ్యాయి.
 

మరిన్ని వార్తలు