స్కామిండియాగా మార్చిన కాంగ్రెస్: నరేంద్రమోడీ

2 May, 2014 01:26 IST|Sakshi

* ఎన్డీఏ విజయ శంఖారావం సభల్లో మోడీ
* అవినీతి కాంగ్రెస్‌ను తరిమి తరిమి కొట్టాలి
సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మారుస్తాం
* దేశ భవిష్యత్తు కోసమే బీజేపీతో పొత్తు: బాబు
* దేశమంతా మోడీ గాలి: పవన్ కల్యాణ్

 
మదనపల్లె/ నెల్లూరు/ గుంటూరు/ భీమవరం, న్యూస్‌లైన్: గడిచిన పదేళ్లలో దేశాన్ని అన్నిరకాలుగా దిగజార్చి, అవినీతిమయం చేసి ‘స్కామ్ ఇండియా’గా మార్చి న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన గురువారం సీమాంధ్రలోని మదనపల్లె, నెల్లూరు, గుంటూరు, భీమవరం పట్టణాల్లో నిర్వహించిన ఎన్డీఏ విజయ శంఖారావం బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆయన హిందీలో ప్రసంగించగా బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు తెలుగులోకి అనువదించారు. స్కీమ్ ఇండియాగా అభివృద్ధి చేయాల్సిన భారతదేశాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కుమారుడు రాహుల్‌గాంధీలు స్కామ్ ఇండియాగా మార్చేసి ఆర్థిక వనరులను దోచేశారని మోడీ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా యువత, మహిళలు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లకుండా నివారించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
 
 రాబోయే ఎన్నికల్లో యూపీఏ కూటమికి చాలా రాష్ట్రాల్లో వచ్చేది సింగిల్ డిజిట్టేనని ఎద్దేవా చేశారు. అవినీతి కాంగ్రెస్‌ను తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో బలమైన ప్రభుత్వం ఏర్పడేందుకు సీమాంధ్ర ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇటలీ దేశం ఏర్పడిన జూన్ రెండో తేదీనే ప్రత్యేక తెలంగాణ , ప్రత్యేక సీమాంధ్ర రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సోనియా యోచించడం సిగ్గుచేటని విమర్శించారు. ఆంధ్రులను అవమానపరచడం మొదటి నుంచి కాంగ్రెస్‌పార్టీకి అలవాటేనని దుయ్యబట్టారు. పీవీ నరసింహారావు మరణిస్తే ఆ భౌతిక కాయాన్ని కూడా కాంగ్రెస్ కార్యాలయానికి తీసుకురానివ్వలేదని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు నదుల అనుసంధానానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చేందుకు బీజేపీ, టీడీపీలు కృతనిశ్చయంతో ఉన్నాయని చెప్పారు.
 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... సోనియాగాంధీకి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఒక రోబో అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తీరు  చాలా బాధాకరమన్నారు. రాజధాని ఎక్కడో తెలియదని, రాజధాని కట్టుకోవటానికి డబ్బులు ఎంత ఇస్తారో కూడా చెప్పకపోడం దుర్మార్గమని మండిపడ్డారు. దేశ భవిష్యతుకోసమే బీజేపీతో పొత్తుపెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు.
 జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తీరు తనకు బాధ కలిగించిందన్నారు. ప్రస్తుతం దేశమంతా మోడీ గాలి వీస్తోందని చెప్పారు. కేసీఆర్ సీమాంధ్రులను తిడుతుంటే జగన్ చూస్తూ ఊరకుండి పోయారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా తాను వెనకాడనని, చీల్చిచెండాడుతానని చెప్పారు.
 మదనపల్లె సభలో చంద్రబాబు, పురందేశ్వరి వేదికపైనే ఉన్నప్పటికీ మాట్లాడుకోలేదు. గుంటూరు సభలో పవన్ కల్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో గందరగోళ పరి స్థితులు ఏర్పడ్డాయి. ఏలూరు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు భీమవరం సభలో మోడీ సమక్షంలో బీజేపీలో చేరారు. విశాఖపట్నం సభ వర్షార్పణమైంది.

>
మరిన్ని వార్తలు