బరితెగించిన కాంగ్రెస్

30 Apr, 2014 04:21 IST|Sakshi
బరితెగించిన కాంగ్రెస్

బంజారాహిల్స్,న్యూస్‌లైన్:  పోలింగ్‌కు ముందే ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల ఆగడాలు మితిమీరాయి. ఆది నుంచి వైఎస్సార్‌సీపీ అంటే గిట్టని ఆ పార్టీ శ్రేణులు దర్జాగా దాడులకు దిగారు. కార్యకర్తల ఇళ్లకు వెళ్లి మరీ బయటకు పిలిచి దాడి చేసేందుకు యత్నించారు. తమ కార్యకర్తలపై దాడులకు దిగుతూ భయభ్రాం తులకు గురిచేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఖైరతాబాద్ నియోకవర్గ అభ్యర్థి పి.విజయారెడ్డి మంగళవారం బంజారాహిల్స్ ఏసీపీ రమేశ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకొని వెంటనే వారిన బైండోవర్ చేయాలని కోరారు.

బంజారాహిల్స్ కార్పొరేటర్ భారతి తనయుడు భానుప్రకాశ్ తమ శ్రేణులను బెదిరిస్తున్నారని, వెంకటేశ్వరనగర్‌లో నివసించే లక్ష్మి అనే మహిళా నాయకురాలిని ఇంట్లో నుంచి బయటకు రావాలంటూ హెచ్చరిస్తూ బయటకొస్తే దాడిచేసేందుకు యత్నిం చారని ఆరోపించారు. విషయం తెలి సినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. నందినగర్‌తోపాటు దాని చుట్టుపక్కల పోలింగ్‌బూత్‌ల వద్ద గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పారామిలటరీ బలగాలను మోహరించాలని ఆమె డిమాండ్ చేశారు. స్పందించిన ఏసీపీ తక్షణం చర్యలు తీసుకుంటానని హామీఇచ్చారు. అదనపు బలగాలను మోహరిస్తామని, ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూస్తానని చెప్పారు.


 అర్ధరాత్రి పోలీసుల హడావుడి: కాంగ్రెస్ నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లల్లోకి చొరబడి తనిఖీలు నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో కాంగ్రెస్‌కు చెందిన బాక్సర్ అశోక్ సైఫాబాద్ పోలీసులపై ఒత్తిడి పెంచి ఖైరతాబాద్‌లో నివసిస్తున్న పలువురు వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లల్లో డబ్బులు పంచుతున్నారని తప్పుడు సమాచారమిచ్చారు. దీంతో వారు కాంగ్రెస్ నాయకులను వెంటబెట్టుకొని వైఎస్సార్‌సీపీ  నాయకులు,కార్యకర్తల ఇళ్లల్లోకి అర్ధరాత్రి చొరబడి తనిఖీలు చేశారు. విషయం తెలుసుకున్న విజయారెడ్డి వెంటనే ఖైరతాబాద్‌కు చేరుకొని పరిస్థితి తెలుసుకున్నారు. అసలు దొంగలను వదిలి తమ కార్యకర్తల ఇళ్లల్లోకి ఎలా చొరబడతారని ఎస్‌ఐని నిలదీశారు. మీకు ఎవరు ఫిర్యాదు చేశారని విజయారెడ్డి సదరు ఎస్‌ఐను నిలదీయగా మొదట సీఐ అని ఆ తర్వాత ఏసీపీ అంటూ నీళ్లు నమిలారు. మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులను వదిలి తమను లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టా రు. ఈ ఘటనతో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు మీడియా ప్రతినిధులు చేరుకోవడంతో కాంగ్రెస్ నాయకులు అక్కడ్నుంచి జారుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు