కాంగ్రెస్, టీడీపీ నాయకుల ఘర్షణ

7 Apr, 2014 00:20 IST|Sakshi
కాంగ్రెస్, టీడీపీ నాయకుల ఘర్షణ

టీడీపీ నాయకుడి మృతి, మరో ముగ్గురికి గాయాలు
 చిలుకూరు, న్యూస్‌లైన్ : తొలి విడత జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ నాయకుడు మృతిచెందగా, అదే పార్టీకి చెందిన మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో శనివారం రాత్రి కాంగ్రెస్, టీడీపీ నాయకులు మద్యం, డబ్బు పంచుతుండగా ఒకరికొకరు ఎదురుపడడంతో ఘర్షణకు దిగారు. అది కొద్దిసేపటికి తీవ్రస్థాయికి చేరి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు పలువురు టీడీపీ నాయకుల ఇళ్లపై దాడి చేశారు.
 
 ఈ క్రమంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మండవ సీతయ్య (55) తీవ్రంగా, ఎలుగూరి వీరస్వామి, బాదె అనిల్, రాముల స్వల్పంగా గాయపడ్డారు. సీతయ్యను చిక్సిత నిమిత్తం కోదాడ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి కారు అక్కడ ఉండడంతో టీడీపీ వర్గీయులు ఆయన కారు ధ్వంసం చేశారు.
 
 మృతుడి కుమారుడు కోటయ్య అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కాంగ్రెస్‌కు చెందిన చిట్టేటి వెంకటేశ్వర్లు, వాస్తురేఖ నాగేశ్వరరావు, మండవ గురునాథం, మండవ నాగార్జున్, రామినేని తులసీరాం, చిట్టేటి బాలకృష్ణ, పనస రాము, తిరుగుమళ్ల సత్యం, తిరుగుమళ్ల సైదులుతో పాటు పలువురిపై హత్య కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ మండాది రామాంజనేయులు తెలిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ చిరంజీవులు, ఎన్నికల జిల్లా పరిశీలకురాలు ప్రియదర్శిని, అడిషనల్ ఎస్పీ రమారాజేశ్వరి గ్రామాన్ని సందర్శించారు. పోలింగ్ ప్రశాంతగా జరిగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు