ఓ రామ మందిరం... 100 స్మార్ట్ సిటీలు

8 Apr, 2014 02:46 IST|Sakshi
ఓ రామ మందిరం... 100 స్మార్ట్ సిటీలు

* బీజేపీ మేనిఫెస్టో విడుదల
* అభివృద్ధి మంత్రంతోపాటు హిందుత్వ జపం
* విధాన పక్షవాతాన్ని, పన్ను ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం
* ఉమ్మడి పౌరస్మృతిని తెస్తాం.. ఆర్టికల్ 370ని తొలగిస్తాం
* ‘రిటైల్’లో మినహా అన్ని రంగాల్లో ఎఫ్‌డీఐని ఆహ్వానిస్తాం
* చవకైన సార్వజనీన జాతీయ ఆరోగ్య హామీ మిషన్ తెస్తాం
* నల్లధనం వెనక్కు తేవటానికి టాస్క్‌ఫోర్సు ఏర్పాటుచేస్తాం
* దేశమంతా ‘ఈ-గ్రామ్, విశ్వ గ్రామ్’ పథకం అమలుచేస్తాం
* ‘అణు’ విధానాన్ని సమీక్షించి.. అనుగుణంగా సవరిస్తాం
* లోక్‌సభ తొలి దశ ఎన్నికల రోజున మేనిఫెస్టో
 
సాక్షి, న్యూఢిల్లీ: విధాన పక్షవాతాన్ని, అవినీతిని, పన్ను ఉగ్రవాదాన్ని రూపుమాపి.. సుపరిపాలన, అభివృద్ధిని అందిస్తామంటూనే.. రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావటం, ఆర్టికల్ 370 తొలగింపు వంటి తమ మూల ఎజెండానూ ప్రతిపక్ష బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 100 కొత్త స్మార్ట్ నగరాల ఏర్పాటు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ఒక్కటే జాతీయ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి, విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని స్థూల దేశీయోత్పత్తిలో ఆరు శాతానికి పెంచటం వంటి పలు హామీలను ఈ ఎన్నికల ప్రణాళికలో చేర్చింది.

యూపీఏ పాలనలో దేశం దశాబ్ద కాలం పాటు లోపభూయిష్ట పరిపాలనకు గురైందని, నిర్ణయాలు, విధానాలు మంచమెక్కాయని ఈ మేనిఫెస్టో విమర్శించింది. ఈ పరిస్థితిని మారుస్తామని, ప్రభుత్వమనే ఇంజిన్‌ను బలమైన సంకల్ప బలంతో, ప్రజా ప్రయోజనాలకు కట్టుబాటుతో నడిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. పారదర్శకమైన, సమర్థవంతమైన, భాగస్వామ్యయుతమైన, ప్రోత్సాహకరమైన సుపరిపాలనను అందిస్తామని.. పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు, ఎన్నికల సంస్కరణలను తీసుకువస్తామని పేర్కొంది.

ప్రజలను చైతన్యం చేయటం, ఈ-పరిపాలన వంటి చర్యలతో అవినీతికి అవకాశాలు లేని వ్యవస్థను నెలకొల్పుతామని చెప్పింది. ఆర్థిక పునరుద్ధరణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి మార్గదర్శక పత్రమంటూ.. బీజేపీ 42 పేజీలతో కూడిన తన ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించింది. దాదాపు వారం రోజుల కిందటే జరగాల్సిన బీజేపీ మేనిఫెస్టో విడుదల.. లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ రోజు వరకూ వాయిదా పడటానికి కారణం.. హిందుత్వ అంశాలను చేర్చే విషయమై పార్టీ అగ్రనేతల మధ్య భిన్నాభిప్రాయాలేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మురళీ మనోహర్‌జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి అమెరికా వరకు లక్ష కన్నా ఎక్కువ సూచనలు అందాయని.. దేశంలోని అన్ని వర్గాల వారి నుంచి సమాచారాన్ని తీసుకుని మేనిఫెస్టోలో పొందుపరిచామని జోషి చెప్పారు. అమృత్‌సర్‌లో నామినేషన్ దాఖలు చేయడం వల్ల సీనియర్ నేత అరుణ్‌జైట్లీ, ఎన్నికల ప్రచారాల్లో ఉండటం వల్ల మాజీ అధ్యక్షులు ఎం.వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కారీలు రాలేకపోయారని వివరించారు.
 
సీమాంధ్రకు పూర్తి న్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు పూర్తి న్యాయం చేస్తామని, సీమాంధ్రతో పాటు తెలంగాణలో అభివృద్ధి, పాలన సమస్యల పరిష్కారానికి బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీమాంధ్రకు పూర్తి న్యాయం చేయడానికి నిబద్ధతతో ఉన్నాం. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను అభివృద్ధి చేయడం, పాలనకు సంబంధించిన అన్ని అంశాలకు పరిష్కారాన్ని చూపిస్తాం’ అని పేర్కొంది.
 
 మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివీ...
 * అణు విధానాన్ని సమీక్షించటం, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించటం
* అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మాణానికి రాజ్యాంగ పరిధిలో గల అన్ని అవకాశాలనూ పరిశీలించటం
 * లింగ సమానత్వం కోసం ఏకీకృత పౌర స్మృతితేవటం.
* జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణ తొలగించటం
* ఉద్యోగాలను సృష్టించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు.. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో మినహా అన్ని రంగాల్లోనూ ఆహ్వానం
* పెట్టుబడిదారులను ఆకర్షించటానికి పన్ను విధానంలో సంస్కరణలపై దృష్టి, జాతీయ సరుకులు, సేవల పన్ను (జీఎస్‌టీ) తేవటం.
* సార్వజనీనమైన అందుబాటులో ఉన్న, చవకౌన, సమర్థవంతమై న ఆరోగ్య సేవలు అందించేందుకు జాతీయ ఆరోగ్య హామీ మిషన్
* ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా సంస్థను నెలకొల్పటం
* నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటం కోసం టాస్క్ ఫోర్సు
* ప్రధాని సహా ముఖ్యమంత్రులు, ఇతర అధికారులను టీం ఇండియాలో భాగస్వాములను చేస్తాం
* అత్యంత వెనకబడిన 100 జిల్లాల్లో సమీకృత అభివృద్ధి
* దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయ్యే సరికి.. దేశంలో ప్రతి కుటుంబానికీ తక్కువ ధరతో పక్కా ఇల్లు నిర్మాణం
* గ్రామీణ పునరుద్ధరణకు పూర్తిస్థాయి కార్యక్రమం. గ్రామీణ ఉపాధి పథకాలను సంపద సృష్టికి అనుసంధానించటం
 * గుజరాత్‌లో అమలుచేస్తున్న ‘ఈ-గ్రామ్, విశ్వ గ్రామ్’ పథకాన్ని దేశమంతా అమలుచేయటం.
 * ప్రతి గ్రామానికీ నీరు, ప్రతి పొలానికీ నీరు
 
 దేశాన్ని గట్టెక్కించే మార్గదర్శి: మోడీ
 ‘‘దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మా పార్టీ మేనిఫెస్టో ప్రతిబింబిస్తోంది. సుపరిపాలన, అభివృద్ధితో పాటు కేంద్రంలో బలమైన ప్రభుత్వం అన్నదే మా ప్రాధాన్యం. మాకు 60 నెలలు అధికారం ఇవ్వండి. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అంతటా నిరాశావాదం నిండివుంది. ఈ పరిస్థితిని బాగుచేసేందుకు దిశ, లక్ష్యం, నిబద్ధతను మా మేనిఫెస్టో వివరిస్తోంది. పేదలు, అణగారినవారి అవసరాలను తీర్చే ప్రధాన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మా లక్ష్యం ఒక భారత్.. ఉన్నత భారత్. అందరినీ కలుపుకు పోవడం - అందరినీ అభివృద్ధి చేయడం. ఈ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. పార్టీ నాపై ఒక బాధ్యతను ఉంచింది. నేను వ్యక్తిగతంగా మూడు హామీలు ఇవ్వాలనుకుంటున్నా. నేను కష్టపడి పనిచేయటంలో ఎన్నడూ లోటు కనిపించదు. నా కోసం ఎప్పుడూ ఏదీ చేయను. దురుద్దేశంతో ఎన్నడూ ఏ పనీ చేయను.’’
 
 దోషాలు లేని మేనిఫెస్టో: అద్వానీ
 ‘‘ఇది వెతికినా లోపాలు దొరకని మేనిఫెస్టో. 1952 నుంచి ఎన్నికలను చూస్తున్నా. ఈ 16వ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరణ, ప్రచార స్వరూపం, పార్టీ భూమిక అపూర్వం. అప్పటి రాజకీయాలు వేరు. ఇప్పుడు మోడీ నేతృత్వంలో రాజకీయాలు చూస్తే అనందానుభూతి కలుగుతోంది. పార్టీ ప్రధాని అభ్యర్ధి ప్రకటన తరువాత జరిగిన ప్రచారం గత ఎన్నికల్లో ఎప్పుడూ జరగలేదు. అధికార బాధ్యత ఇస్తే రానున్న ఐదేళ్లలో దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించి చూపిస్తాం.’’
 
 హామీలన్నీ నెరవేరుస్తాం: రాజ్‌నాథ్
 ‘‘మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక మేనిఫెస్టోలోని అంశాలే కాకుండా దేశంలోని సమస్యలు, సవాళ్లను పరిష్కరిస్తాం. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే దేశం విశ్వశక్తిగా ఎదిగేది. దేశంలో సమగ్ర సమీకృత అభివృద్ధి జరగాలి.’’  
 
 దేశాన్ని పరుగెత్తిస్తాం: సుష్మాస్వరాజ్
 ‘‘దేశాన్ని వర్తమాన స్థితి నుంచి గట్టెక్కించేందుకు ఒక మార్గాన్ని చూపించే పత్రం ఈ మేనిఫెస్టో. దేశంలో పాలన స్థంభించిపోయింది. అధికారంలోకి వచ్చాక స్థంభించిన ప్రభుత్వాన్ని నిల్చొబెడతాం. నడిపిస్తాం. కొద్ది రోజుల్లో పరుగెత్తిస్తాం.’’

మరిన్ని వార్తలు