నరేంద్ర మోడీ 'వివాహ' వివాదం

22 Apr, 2014 19:51 IST|Sakshi
యశోదా బెన్ - నరేంద్ర మోడీ

 ఢిల్లీ/చెన్నై/గాంధీ నగర్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తనకు వివాహమైన విషయాన్ని ఇంతకాలం దాచిపెట్టిన అంశం వివాదానికి దారితీసింది. పలువురు ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. మద్రాస్ హైకోర్టులో ఒకరు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)  దాఖలు చేస్తే, ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.వడోదరలో నామినేషన్ దాఖలు చేసే సమయంలో మోడీ మొదటిసారిగా తనకు పెళ్లైన విషయాన్ని బయట పెట్టారు. తన భార్య పేరు యశోదా బెన్ అని కూడా పేర్కొన్నారు.

భార్య పేరును దాచిపెట్టిన నరేంద్రమోడీపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరుతూ చెన్నైకి చెందిన వారాహి అనే జర్నలిస్ట్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)  మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. గుజరాత్లో ఇంతకు ముందు మోడీ తన నామినేషన్ పత్రాల్లో అవివాహితుడిగా పేర్కొని భార్య పేరును గోప్యంగా ఉంచారని వారాహి తన పిల్లో పేర్కొన్నారు. తాజా ఎన్నికల సమయంలో మాత్రమే తన కు 17 ఏళ్ల వయసులో యశోదాబెన్ అనే మహిళతో వివాహం అయ్యిందని పేర్కొన్నారని వారాహి కోర్టుకు తెలిపారు. ప్రజాప్రతినిధిగా వివరాలను దాచిపెట్టడం చట్టప్రకారం నేరం అవుతుందని పిటిషన్‌దారుడు వ్యాఖ్యానించారు.  ఇవే అభియోగాలపై ఈ నెల 20న ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇది ఎన్నికల సంఘం పరిధిలోని అంశంగా కోర్టు పేర్కొంది.

ఇదిలా ఉండగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అతని  వివాహ అంశంపై తమకు ఫిర్యాదు అందిందని, అది తమ పరిశీలనలో ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విఎస్ సంపత్ గాంధీనగర్లో చెప్పారు. మోడీ తన అఫిడవిట్లో  భార్యకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వలేదని వడోదరలో తన ప్రత్యర్థి మధుసూదన్ మిస్త్రీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
 

మరిన్ని వార్తలు