కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

12 May, 2014 01:09 IST|Sakshi
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

 ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. స్థానిక సీఆర్‌ఆర్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆదివారం రాత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.  ఓట్ల లెక్కింపు సమయానికి గంటముందే పోటీచేసే అభ్యర్థులు, వారి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని చెప్పామన్నారు. లెక్కింపునకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఒక్కో కౌంటింగ్ హాలులో 10 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు.
 
 జిల్లాలో ఆయా పురపాలక సంఘాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రతి కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంటుందని సిద్ధార్థజైన్ చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సక్రమంగా, సజావుగా నిర్వహించడానికి ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించామన్నారు. ఎప్పటికప్పుడు ఫలితాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయడానికి ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో మీడియాకు ప్రత్యేక రూము ఏర్పాటు చేశామని అక్కడ టీవీ, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు టెలిఫోన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ కేఈ సాధన, ఎస్‌ఈ యోహన్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు