ఓటేద్దాం..రండి!

11 Apr, 2014 05:18 IST|Sakshi

సాక్షి, కరీంనగర్ : ప్రజాస్వామ్య దేశంలో పౌరుల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. అది పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు. కుళ్ల రాజకీయాలను కూలదోసి, స్వచ్ఛమైన, సమర్థవంతమైన పాలకులను గద్దెనెక్కించే  ఆయుధం. అంతటి ప్రాధాన్యం కలిగిన ఓటుహక్కును ఎంతమంది బాధ్యతగా వినియోగించుకుంటున్నారంటే.. మన జిల్లాలో సగటున నూటికి 70శాతం.

 ప్రతి ఎన్నికల్లో ఇంచుమించు ఇదే స్థాయిలో పోలింగ్ శాతం నమోదవుతోంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటు న్నా.. ప్రత్యేక ఓటరు నమోదు, చైతన్య కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించినా ఆశించినంత ఫలితం రావడంలేదు. గ్రామీణ ప్రాంత ఓటర్లకంటే.. విద్యావంతులైన పట్టణ ఓ టర్లే ఓటుహక్కును వినియోగించుకునేందుకు బద్ధకిస్తుండటం విచారకరం. గతనెల 30న జరి గిన మున్సిపల్, ఈ నెల 6న జరిగిన తొలివిడత ప్రాదేశిక ఎన్నికలే ఇందుకు నిదర్శనం.

  గతనెల 30న జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 7,10,654 మంది ఓటర్లుండ గా, 5,35,950 మంది మాత్రమే తమ ఓటును వినియోగించుకున్నారు. 1,74,704 మంది ఓ టుకు దూరమయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 2,28,856 ఓటర్లుండగా 1,36,400 మంది మాత్రమే ఓటేశారు. 92,450 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండేవారు పదివేల మంది అనుకున్నా.. స్థానికంగా ఉన్నవారూ ఓటేసేందుకు ముందుకురాకపోవడం గమనార్హం.

 రామగుండం కార్పొరేషన్‌తోపాటు కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీలు, జమ్మికుంట, వేములవాడ, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్ నగర పంచాయతీల్లో వేలాది మంది ఓటుహక్కును వినియోగించుకోలేదు.

  ఈ నెల 6న పెద్దపల్లి, జగిత్యాల, మంథని రెవెన్యూ డివిజన్లలో జరిగిన తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 2,24,534 మంది ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. మొత్తం 10,17,238 మంది ఓటర్లుండగా.. 7,92,704 మంది మాత్రమే ఓటేశారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల పరిచయాలు ఎక్కువే. తమ గెలుపు కోసం ఓటర్లను చైతన్యపర్చాల్సిన అభ్యర్థులు కూడా ఎంతో కష్టపడ్డారు. అయినా ఆశించిన మేర పోలింగ్ జరగకపోవడం                గమనార్హం.


 ఫలితమివ్వని ప్రచారం..
 దాదాపు నాలుగు నెలల నుంచి.. ‘అర్హత ఉన్న ప్రతిఒక్కరూ ఓటేయడం మరవొద్దు.. ఓటు లేని వారు దరఖాస్తు చేసుకోండి..’ అని విస్తృతంగా ప్రచారం చేసిన అధికారులు.. ఓటుహక్కు దరఖాస్తుకు గడువుల మీద గడువులిచ్చిన ఎన్నికల సంఘం లక్ష్యం జిల్లాలో నెరవేరలేదు. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతోపాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు పలుమార్లు అవకాశం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా లక్షకుపైగా మంది యువత కొత్తగా ఈసారి ఓటుహక్కు పొందారు.

వీరితో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లోని ఓటర్లందరితో ఓటు వేయించేందుకు వారిని చైతన్యపరుస్తున్నారు. ప్రతి ఓటరు నిర్భయంగా.. ఎవరికీ భయపడకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని ఓటర్లకు సూచిస్తున్నారు. అధికారులు కూడా పల్లెల్లో, మండల కేంద్రాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ఓటు విలువను వివరిస్తున్నారు. అయినా ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో లక్షలాది మంది ఓటుకు దూరంగా ఉండడం గమనార్హం.

 రండీ.. ఓటేద్దాం..!
 పాశుపతాస్త్రమైన ఓటు హక్కు వినియోగించుకోకపోతే అందరి కంటే ముందు నష్టపోయేదీ మనమే అని మరిచిపోవద్దు. మన ఓటు ఓ అభ్యర్థిని ఓడించడంతో పాటు గెలిపించగలదని గుర్తుంచుకోవాలి. ఒకరిపై ఉన్న వ్యతిరేకతతో ఇతరులకు ఓటేయకపోతే మంచి భావాలున్న మరో వ్యక్తి ఓడిపోయే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అర్హుడైన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాలని మేధావులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు