ఓట్ల సాగు

23 Mar, 2014 00:33 IST|Sakshi
ఓట్ల సాగు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కొండకు దారం కట్టడం... గుండె ధైర్యంతో లాగటం.. ఇది కేసీఆర్ నైజం. శత్రువు బలాబలాల జోలికి వెళ్లకుండా... బలహీనతల మీద గురి చూసి కొట్టడం ఆయన స్వభావం. చురకత్తుల్లాంటి మాటలను సగటు ఓటరు మనసులోకి దింపటం ఆయన అలవోకగా చేయ గలిగే పని. గులాబీబాస్ రాబోయే ఎన్నికలకు కూడా అదే వ్యూహాలను అమలు చేస్తున్నారు. సొంతబలం మీద అంతగా ఆశలు లేకున్నా... గజ్వేల్ బరిలో నిలబడి మెదక్ జిల్లాలో ఓట్ల పండించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.

 
రైతుల చావును చూసిన నేలపైనే ప్రయోగం చేసి, పంట తీసి ‘కోట్లు’ రాబట్టిన కేసీఆర్... అలాంటి ప్రయోగంతోనే మెతుకు సీమలో ‘ఓట్లు’  పిండుకునే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీకి పట్టులేదు కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు పెద్దగా బలం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే గజ్వేల్‌లో  మొదటి రెండుస్థానాల కోసం కాంగ్రెస్, టీడీపీ పోటీ పడుతుండగా టీఆర్‌ఎస్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. అయినప్పటికీ కేసీఆర్ విజయావకాశాల మీద ఎవరికి అనుమానం లేదు.

నిజానికి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం వెనుక రాజకీయ ఎత్తుగడే ఉన్నట్లు తెలుస్తోంది. మలివిడత తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్ పార్టీకి మెదక్ జిల్లా పుట్టినిల్లు. అయినా జిల్లాలో పార్టీకి బలమైన పునాదులు లేవు. సిద్దిపేట, మెదక్ నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ బలంగా ఉంది.  మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న  నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనైతే టీఆర్‌ఎస్ అత్యంత బలహీనంగా ఉంది. గ్రామ స్థాయిలో సైతం కేడర్ లేదు. జోగిపేట, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో  పార్టీకి అంతగా పట్టులేదు.

సంగారెడ్డి, దుబ్బాక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు క్యాడర్ ఉన్నప్పటికీ, ఇక్కడ వర్గ పోరు తీవ్రంగా ఉంది. ఇక దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు వైరి వర్గాలుగా మారారు. ఇప్పటికే వీరిద్దరూ ఈ సీటు కోసం మందీమార్భలంతో  కేసీఆర్‌ను కలిశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనూ టీఆర్‌ఎస్ పరిస్థితి ఇలాగే ఉంది. మున్సిపల్ టికెట్లకోసం ఇప్పటికే గులాబిదండు గుద్దులాడుకుంది.

చింతాప్రభాకర్ నియోజక వర్గం ఇన్‌చార్జిగా ఉండగా... ఐసీ గంగా మోహన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కుమారుడు నిరూప్‌రెడ్డి ఇక్కడ టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే నిరూప్‌రెడ్డికి ఇంతవరకూ పార్టీలో సభ్యత్వం లేకపోయినప్పటికీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్లలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా, మరొకరు అలిగే అవకాశం ఉంది. మొత్తంగా జిల్లాలో సిద్దిపేట, మెదక్ మినహా అన్ని నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులున్నాయి.
 
 సొంతింటిని చక్కబెట్టుకోవడం కోసమే
 ఒంటరిగా నిలబడితే టీఆర్‌ఎస్‌కు రెండు నుంచి మూడు సీట్లకంటే ఎక్కువగా వచ్చే అవకాశం లేదు.  సొంతింట్లోనే బలం లేనప్పుడు బయటి గెలవడం కష్టమని భావించిన గులాబీ దళపతి, ఇంటిని చక్కబెట్టే పనిలో భాగంగానే గజ్వేల్‌ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్‌ను కేంద్రంగా చేసుకుని మిగిలిన నియోజకవర్గాలపై పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది.

 కేసీఆర్ ప్రభావం జిల్లాలోని మిగిలిన నియోజక వర్గాలపై తప్పకుండా పడే అవకాశం ఉంది. దీంతో పాటు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి... మెతుకు సీమ ప్రజలను, నాయకులను మానసికంగా సిద్ధం చేయవచ్చనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తె లుస్తోంది. కేసీఆర్ వేసిన గజ్వేల్ ఎత్తు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే మెదక్ పార్లమెంటుకు పోటీ చేస్తాననే అస్త్రం ఆయన వద్ద సిద్ధంగా ఉన్నట్లు  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు