ప్రధాని మాటను దాసరి విన్లేదు

15 Apr, 2014 09:08 IST|Sakshi
ప్రధాని మాటను దాసరి విన్లేదు

బీజేపీ అధికార ప్రతినిధి జవదేకర్
సోనియా చెప్పినట్లే ప్రధాని చేశారు
బొగ్గు గనుల కేటాయింపు పక్కా క్విడ్‌ప్రోకో

 

హైదరాబాద్: ‘దాసరి నారాయణరావు. శిబూ సోరెన్‌లు  కేంద్ర మంత్రులుగా ఉండగా ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట వినేవారు కాదు. అంతా టెన్ జన్‌పథ్ చెప్పినట్టు చేసేవారు. ఇంత ధైర్యం ఎలా వచ్చింది.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్ల కాదా? చరిత్రలో ఇలాంటి దారుణం గతంలో చూశామా. బొగ్గు బ్లాకుల కేటాయింపు వ్యవహారమంతా టెన్ జన్‌పథ్ సూచనల మేరకు జరగలేదా? ఆయా బ్లాకులు ఎవరికి కేటాయించాలో రాసి ఉన్న చిట్టీలు వచ్చేవి. వాటి ప్రకారమే కేటాయింపులు జరిగాయి. ఆ చిట్టీలు ఎక్కడి నుంచి వచ్చేవో సోనియా, ప్రధాని సమాధానం చెప్పాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు.

కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పరేఖ్ రాసిన పుస్తకంలో బొగ్గు కుంభకోణం, ప్రధాని వ్యవహార శైలి తదితరాల ప్రస్తావన నేపథ్యంలో ఆయన సోమవారం  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మన్మోహన్‌ను రబ్బర్ స్టాంపుగా తయారు చేసి సోనియా చక్రం తిప్పారని, ఈ క్రమంలోనే లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం చోటుచేసుకుందన్నారు. క్విడ్‌ప్రోకో ప్రకారం జరిగిన ఈ వ్యవహారంలో సీబీఐ డొల్లతనం ప్రదర్శించిందని విమర్శించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించి పరేఖ్ నివేదికలను నాటి మంత్రి దాసరి నారాయణరావు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారం తెలిసి కూడా ప్రధాని మౌనంగా ఉండటానికి కారణం తెలియాల్సిన అవసరముందన్నారు. ఇంత జరిగినా సోనియా ఎందుకు నోరువిప్పటం లేదని ప్రశ్నించారు.

ఇప్పటికే ప్రధాని మాజీ సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం.. సోనియా, మన్మోహన్‌ల వ్యవహారాన్ని బయటపెట్టగా, పరేఖ్ పుస్తకం మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తెచ్చిందన్నారు.  కాంగ్రెస్ వద్ద సమాధానాలు లేకే బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఆర్థిక తోడ్పాటుతోనే ఈ పుస్తకాలు వెలువడ్డాయని బుకాయించి తన నైజాన్ని బయటపెట్టుకుందని జవదేకర్ విమర్శించారు. అభిమానం గల వ్యక్తిత్వం ఉండి ఉంటే మన్మోహన్ ఇప్పటికే రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు.
 
టీడీపీతో సమన్వయం బాగుంది

 రాష్ట్రంలో మిత్రపక్షం టీడీపీతో తమకు మంచి సమన్వయం ఉందని జవదేకర్ తెలిపారు. ప్రచారంలో ఇరు పార్టీల నేతలు కలిసి సాగుతున్నారని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణల్లో కలిపి 25 వరకు ఎంపీ సీట్లను కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఈసారి మూడు సీట్లకే పరిమితమవుతుందన్నారు. ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు.
 

మరిన్ని వార్తలు