వాంటెడ్.. హెలికాప్టర్లు

23 Mar, 2014 01:49 IST|Sakshi
వాంటెడ్.. హెలికాప్టర్లు

 అడ్వాన్స్ బుకింగ్ పూర్తి  కిరణ్, చంద్రబాబుకు దొరకని వైనం

 

 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ ప్రైవేట్ హెలికాప్టర్లు, విమానాలకు గిరాకీ పెరిగింది. జాతీయ పార్టీలతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ప్రచారానికి వెళ్లటానికి హెలికాప్టర్లను ముందుగానే బుక్ చేసుకున్నారు. ప్రైవేటు ఆపరేటర్లు నడిపించే అన్ని హెలికాప్టర్లనూ ఇప్పటికే చాలా మంది నేతలు బుక్ చేసేసుకోవటంతో.. కాస్త ఆలస్యంగా స్పందిస్తున్న నేతలకు ఇప్పుడు హెలికాప్టర్లు దొరికే పరిస్థితి లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ హెలికాప్టర్లు, విమానాలను ప్రధానమంత్రిగాని, ముఖ్యమంత్రులు గానీ వినియోగించరాదు. దీంతో జాతీయ పార్టీల నేతలు, ప్రాంతీయ పార్టీల నేతలు ప్రైవేట్ హెలికాప్టర్లను వినియోగించక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే జీఎంఆర్ సంస్థ దేశంలోని రెండు జాతీయ పార్టీలను సంతృప్తి పరిచేలా వ్యవహరించింది. కాంగ్రెస్, బీజేపీలతో పాటు జయలలిత, కరుణానిధి, నవీన్‌జిందాల్, శరద్‌పవార్‌లు ప్రైవేట్ హెలికాప్టర్లు, విమానాలను ముందుచూపుతో జనవరి నెలలోనే అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకున్నారు. వినియోగించినా వినియోగించకపోయినా అలా బుక్ చేసుకున్న కాప్టర్లకు రోజుకు కనీసం నాలుగు గంటలు ఫ్లైయింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గంటకు మూడు లక్షల చొప్పున చార్జీలతో మార్చి నుంచి వినియోగించుకునేలా ఆయా పార్టీలు, నేతలు ప్రైవేట్ హెలికాప్టర్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు.

 

 కిరణ్, చంద్రబాబులకు దొరకని కాప్టర్లు...

 

 దేశంలో వీఐపీల వినియోగానికి పనికి వచ్చే పది నుంచి 12 హెలికాప్టర్లను ఎన్నికల నేపథ్యంలో నేతలందరూ బుక్ చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు హెలికాప్టర్ల కోసం ప్రయత్నించినప్పటికీ వారికి దొరకలేదని సమాచారం. కిరణ్ ఇటీవలి కాలంలో విశాఖ పర్యటన కోసం ప్రైవేట్ హెలికాప్టర్ కోసం ప్రయత్నించగా దొరకలేదు. చంద్రబాబు కూడా ప్రైవేట్ హెలికాప్టర్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

 

 ఏ కంపెనీ కాప్టర్లు ఎవరెవరికి...

 

 - జీఎంఆర్‌కు చెందిన రెండు హెలికాప్టర్లను, ఒక విమానాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంది. అన్నీ ఏఐసీసీకే ఇస్తే మరో జాతీయ పార్టీ బీజెపీకి ఆగ్రహం వస్తుందని గ్రహించిన జీఎంఆర్ తెలివిగా మరో విమనాన్ని బీజెపీకి కూడా అద్దెకు ఇచ్చింది.

 - నవయుగ సంస్థకు చెందిన హెలికాప్టర్లను జయలలిత బుక్ చేసుకున్నారు.

 - హెలిగోకు చెందిన హెలికాప్టర్‌ను డీఎంకే అధినేత కరుణానిధి కోసం బుక్‌చేశారు.

 - జిందాల్ సంస్థకు చెందిన నాలుగు హెలికాప్టర్లను కాంగ్రెస్ కోసం నవీన్‌జిందాల్ వినియోగిస్తున్నారు.

 - డీఎల్‌ఎఫ్ సంస్థకు చెందిన హెలికాప్టర్‌ను నరేంద్రమోడీ వినియోగిస్తున్నారు.

 - ఇయాన్ సంస్థ హెలికాప్టర్‌ను శరద్‌పవార్ బుక్ చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు