కౌంటింగ్ ఏర్పాట్లు అస్తవ్యస్తం

11 May, 2014 23:31 IST|Sakshi

పటాన్‌చెరు,న్యూస్‌లైన్:  పటాన్‌చెరు మండలం పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తొలుత సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్‌లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తారని అధికారులు తెలిపారు. కానీ అక్కడ వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో కౌంటింగ్ కేంద్రాన్ని సంగారెడ్డిలోని పాత వెలుగు (డీఆర్‌డీఏ) కార్యాలయంలో ఏర్పాటు చేశారు.  కౌంటింగ్ కోసం కేటాయించిన  గది చిన్నగా ఉండ టంతో 11 టేబుళ్లకు బదులుగా 8 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల సంఖ్యకు అనుగుణంగా 14 టేబుళ్లు వేసినా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగదని అలాంటిది ఎనిమిది టేబుళ్లపై కౌంటింగ్ చేయడం కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు.

 గతంలో కూడా అమీన్‌పూర్ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు అర్థరాత్రి దాటిన తర్వాతే వెల్లడయ్యాయి. ప్రతి ఓటు వివాదస్పదమయ్యే ఉత్కంఠ పరిస్థితులు పటాన్‌చెరు మండలం పరిధిలోని అన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఉంటుంది.  నాలుగు టేబుళ్ల వద్ద మాత్రమే ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. మిగతా నాలుగు టేబుళ్లపై జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు.  తొలుత బాక్స్‌లను తెరిచి బ్యాలెట్ పత్రాలను వేర్వేరుగా చేసి జెడ్పీటీసీ ఓట్లను ఓ పెద్ద డబ్బాలో వేస్తారు.  బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున కట్టలు కట్టి లెక్కింపు ప్రారంభిస్తారు. దాదాపు ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఒంటి గంట తర్వాతే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అధికార వర్గాలు అంచనా. ఒక్కో రౌండు పుర్తయ్యేందుకు కనీసం రెండు గంటల సమయం తీసుకుంటుందని వారు వివరిస్తున్నారు. ఆ లెక్కన ఏడు రౌండ్ల లెక్కింపు జరిగే సరికి 14 గంటల సమయం పడుతుంది.

 అంటే రాత్రి ఓంటి గంట వరకు ఫలితాలు వెల్లడయ్యే పరిస్థితి లేదు. ప్రతి రెండు గంటలకోసారి ఎంపీటీసీ ఫలితాలు వెల్లడవుతాయి. తక్కువ ఓట్లు ఉన్న పాటి, ఘనపూర్ వంటి వాటి ఫలితాలు త్వరగానే పూర్తవుతాయి. అయినా అర్థరాత్రి దాటితేనే కాని జెడ్పీటిసీ ఇతర ఎంపీటీసీల ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తి కాదని అనుభవజ్ఙులు పేర్కొంటున్నారు. ఇది కూడా శాంతియుతంగానే కౌంటింగ్ జరిగితేనే సాధ్యపడుతుందని అంచనా. కాని ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తక్కువ ఓట్లతో నెగ్గే పరిస్థితుల్లో రీకౌంటింగ్ వంటివి జరిగితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది.

మరిన్ని వార్తలు