కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

28 Apr, 2014 03:40 IST|Sakshi
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

- తెలంగాణ క్రెడిట్ మాదే
- ఫామ్‌హౌజ్‌లో కూర్చునేవారికి అధికారమా?
- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్


 సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ అన్నారు. జాతీయపార్టీ, లౌకికత్వానికి మారుపేరైన కాంగ్రెస్‌తోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రాంతీయపార్టీలతో తెలంగాణ అభివృద్ధి అసాధ్యమన్నారు.

 ఫాంహౌజ్‌లో కూర్చుని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు పంపిణీ చేసే వ్యక్తుల చేతికి అధికారం అప్పగిస్తే... తర్వాత ఈ ప్రాంతానికి మంజూరయ్యే పరిశ్రమలు.. పవర్ ప్రాజెక్టులు.. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ మళ్లీ ఆయన కుటుంబసభ్యులకే దక్కుతాయని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు.

 తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే పురుడు పోసుకుందని, చంటిపిల్ల లాంటి ఈ తెలంగాణను ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందని అన్నారు.

 బీజేపీది విభజించి పాలించే తీరు
 ప్రస్తుత ఎన్నికలు లౌకికవాదానికి, మతతత్వానికి మధ్య పోరు అని ఆజాద్ అన్నారు. బీజేపీ మత రాజకీయాలను ప్రేరేపిస్తూ.. విభజించి పాలించే పాలసీతో పని చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ఉన్న అన్ని కులాలు.. మతాలు.. వర్గాలను సంఘటితంగా ఉంచి.. వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం కాంగ్రెస్ సిద్ధాంతమని వెల్లడించారు.

బీజేపీది నాధూరాంగాడ్సే మార్గమని.. కాంగ్రెస్‌ది అహింసామార్గమని అన్నారు. బీజేపీ ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్ అధికారంలో వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

 బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హయాంలో 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు అందరికీ తెలిసిన విషయమేనని, మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదని అన్నారు.  కార్యక్రమంలో కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు