ఓటుహక్కుపై నిరాసక్తత వద్దు

8 Apr, 2014 00:21 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  జిల్లాలోని ప్రతి ఓటరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఓటు విషయంలో నిరాసక్తత ప్రదర్శించకూడదని కలెక్టర్ బి. శ్రీధర్ సూచించారు. ఓటు హక్కు వినియోగంపై  కలెక్టర్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ‘ఓటు వేస్తాం’ అంటూ ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించి ఆ ఫొటోలను తనకు పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

 జిల్లాలో పనిచేసే ఉద్యోగులందరూ జిల్లాలోనే ఎన్నికల విధులు నిర్వహించాలని, జీహెచ్‌ఎంసీ పంపిన ఉత్తర్వులను తగు వివరణలతో తిప్పి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా మొత్తం మీద ఎన్నికల నిర్వహణకు 33 వేల మంది సిబ్బంది అవసరమవగా ఇప్పటి వరకూ 20 వేల మంది వివరాలు మాత్రమే అందాయని, ఇంకా 13 వేల మంది సిబ్బంది కొరత ఉందని తెలిపారు. పదవీ విరమణ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ముందుకు రావాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు 98663 06532 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికల విధులు నిర్వహిస్తామంటూ  జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రమాణం చేయించారు. సమావేశంలో ఓటర్ల అవగాహన నోడల్ అధికారి డాక్టర్ అనంతం, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు