దుద్దిళ్ల వర్సెస్ పొన్నం

21 Mar, 2014 17:35 IST|Sakshi
దుద్దిళ్ల వర్సెస్ పొన్నం

కరీంనగర్: కలిసి ఉన్నట్లు కనిపించినా... కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు అంతర్గతంగా రాజుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఛైర్మన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ మధ్య కోల్డ్‌వార్ ముదురుతోంది. మొన్నటివరకు పీసీసీ చీఫ్ రేసులో అధిష్టానం దృష్టిలో పడ్డ వీరిద్దరూ... సొంత జిల్లాలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారు. అవునంటే కాదనిలే అన్నట్లు ఎవరికివారుగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవల తెలంగాణ విజయోత్సవ సంబరాల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో రచ్చకెక్కిన విభేదాలు వరుసగా వచ్చిన ఎన్నికలతో మరింత రాజుకోవటం ఖాయమైంది.

ఇటీవల ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని చొప్పదండి నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్టు ఆశిస్తున్నారు. ముందుగా మంత్రిని ఆశ్రయించటంతో పాటు... శ్రీధర్‌బాబు ఇచ్చిన భరోసా మేరకే కాంతం పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్, మాజీ మంత్రి సమక్షంలో కాంతం కాంగ్రెస్‌లో చేరిన సందర్భంలోనూ పొన్నం ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈలోపు తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్‌ను కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు ఎంపీ ప్రయత్నాలు చేశారు.

చివరి నిమిషంలో మానకొండూరు నుంచి పార్టీ టికెట్టు హామీ ఇవ్వటంతో బాలకిషన్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్... టీఆర్‌ఎస్... ఏదో ఒక పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య తెరపైకి వచ్చారు. మొన్నటివరకు దూరం పెట్టిన దేవయ్యను పార్టీలోకి చేర్చుకునేందుకు ఎంపీ తన వంతుగా లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే విషయుంపైనే దేవయ్య హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాలను కలిసినట్లు సమాచారం. దీంతో రేపో మాపో దేవయ్య పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

ఓయూ జేఏసీ విద్యార్థి నాయకుడు మేడిపల్లి సత్యం సైతం చొప్పదండి నుంచి కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తున్నారు. సిట్టింగ్ కావటంతో ఎంపీ వ్యూహాత్మకంగానే దేవయ్యను టికెట్టు రేసులోకి తెచ్చి.. గజ్జెల కాంతంకు, ఆయనను ప్రోత్సహించిన మాజీ మంత్రికి చెక్ పెట్టినట్లయిందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. సామాజిక వర్గాల సమీకరణాల్లోనూ దేవయ్యను పార్టీలోకి చేర్చుకోవటం సరైందనే వాదన పార్టీ నాయకుల్లో వినిపిస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలోనూ ఎంపీ, మంత్రి మధ్య అంతరం పెరిగిపోయింది. తెలంగాణ విజయోత్సవ సంబరాల్లో మంత్రి వర్గీయులుగా హల్‌చల్ చేసి గొడవకు దిగిన వారందరికీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో టికెట్లు ఇవ్వకుండా చెక్ పెట్టాలని ఎంపీ పంతం పట్టారు.

ఈ టికెట్ల వ్యవహారంలో తమను లెక్కచేయకపోతే బహిరంగంగా ప్రెస్‌మీట్ పెట్టి నిలదీస్తావుని ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ మాజీ మంత్రి దగ్గర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బయటకు పొక్కింది. ఎంపీ.. మంత్రి వర్గీయుల పంతం కారణంగానే కార్పొరేషన్‌లో పార్టీ అభ్యర్థిత్వాలు కొలిక్కి రాలేదు. ఆఖరి రోజు వరకు 50 డివిజన్లలో అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ వెనుకా ముందాడింది. ఒకప్పుడు ఒకే వర్గంగా ఉన్న శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లు తెలంగాణ ఉద్యమం తీవ్రతరమవుతున్న కొద్దీ దూరం పెరుగుతూ రావటం గమనార్హం.

మరిన్ని వార్తలు