దుర్మార్గంగా ఓటర్ల జాబితా తయారీ : కోటంరెడ్డి

2 Apr, 2014 02:39 IST|Sakshi

నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: రెండురోజుల కిందట జరిగిన కార్పొరేషన్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను దుర్మార్గంగా తయారు చేశారని వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. అస్తవ్యస్త ఓటరు జాబితాను సార్వత్రిక ఎన్నికల నాటికి సరిదిద్దాలని మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లగా పోటీ చేసిన అభ్యర్థులతో కలిసి ఆయన ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.
 
 కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ అక్రమాలకు తావులేకుండా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఉత్వర్వులిచ్చినా క్షేత్రస్థాయిలో గందరగోళంగా తయారు చేశారని మండిపడ్డారు. వార్డుల విభజనలో కూడా ఇష్టానుసారం వ్యవహరించారన్నారు. ఒక డివిజన్‌లో 5 వేలు ఓట్లు, మరో డివిజన్‌లో 10 వేలు ఓట్లు చీల్చి ఇష్టానుసారం డివిజన్లను విభజించారని మండిపడ్డారు. బీసీలను ఓసీలుగా, ఓసీలను బీసీలుగా, ఎస్సీలుగా గణాంకాలు చేస్తూ లెక్కలేనన్ని అక్రమాలతో జాబితాలు తయారు చేశారని ఆరోపించారు.
 
 ఓటర్ల జాబితాలో గందరగోళం వల్లే కార్పొరేషన్ ఎన్నికల్లో 40 శాతం మంది తమ హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. ఓటర్లు తమకు స్లిప్పులు అందలేదని ఫిర్యాదు చేస్తుంటే రాజకీయ పార్టీలు స్పందించి పంపిణీ చేసేందుకు ప్రయత్నించడాన్ని పోలీసులు అడ్డుకుని కేసులు పెడతామనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మే 7న సార్వత్రిక ఎన్నికల్లోనైనా ఇలాంటి ఘోరమైన పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయాలని కోరారు. పొరపాట్లను సరిదిద్దకపోతే ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
 
 అడ్డుకున్న పోలీసులు
 తప్పులు తడకగా తయారు చేసిన ఓటరు జాబితా విషయమై వైస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీ నెల్లూరురూరల్ నియోజక వర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ అభ్యర్ధులు, కార్యకర్తలతో కలిసి ఆర్డీవోను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తమ అభ్యర్థులతో మాత్రమే కార్యాలయంలోకి వెళ్తామని, కేవలం వినతిపత్రం అందచేస్తామని కోటంరెడ్డి హామీ ఇవ్వడంతో పోలీసులు వారిని లోనికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వర్లు, నెల్లూరురూరల్ నియోజక వర్గంలోని ఆయా డివిజన్లకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు