సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

13 Apr, 2014 01:59 IST|Sakshi
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
 గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్‌ను శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సురేశ్‌కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  జిల్లాలోని రెండు పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేశామని చెప్పారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో తొలిరోజు గుంటూరు పార్లమెంట్‌కు ఒక నామినేషన్,  నరసరావుపేట పార్లమెంట్‌కు ఒక నామినేషన్ దాఖలు అయినట్టు కలెక్టరు చెప్పారు. జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 10 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. తాడికొండకు-1, మంగళగిరి-2,తెనాలి-1,బాపట్ల-1,మాచర్ల-1,గుంటూరు తూర్పు-1, గుంటూరు పశ్చిమ-3 నామినేషన్లు దాఖలైనట్టు ఆయన వివరించారు. ఈ నెల 19వ తేదీ వరకు సెలవు దినాలలో మినహా మిగిలిన రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు.
 
 విజయవంతంగా ముగిసిన స్థానిక ఎన్నికలు
 జిల్లాలో పురపాలక , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎటువంటి రీపోలింగ్‌కు అవకాశం లేకుండా విజయవంతంగా నిర్వహించినట్టు కలెక్టర్ సురేశ్‌కుమార్ చెప్పారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, రెవెన్యూ, పోలీసు, ఇతర అధికారులు, సిబ్బంది సహకరించడం వలనే ఎన్నికలు సజావుగా నిర్వహించగలిగామన్నారు. 2006 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో 75.35 శాతం మాత్రమే పోలింగ్ జరిగిందని, ఈసారి 85.5 శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు. నిజాంపట్నం, రెంటచింతల మండలాలలో మాత్రం తక్కువ శాతం పోలింగ్ జరిగిందన్నారు. అత్యధికంగా దుగ్గిరాలలో 91.59 శాతం, తుళ్లూరులో 91.18 శాతం నమోదయ్యాయని, అత్యల్పంగా నిజాంపట్నంలో 74.84 శాతం, గురజాలలో 80.34 శాతం నమోదయ్యాయన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గత ఎన్నికలలో 75 శాతం పోలింగ్ నమోదైందని, ఈసారి ఎన్నికలలో 90 శాతం ఓటింగ్ పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి ఓటర్లను చైతన్యపరుస్తున్నట్టు వివరించారు.
 
 ఈ నెల 14న అన్ని నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను చైతన్యపరచడానికి విలేజ్ అవేర్‌నెస్ కార్యక్రమం చేపడుతున్నట్టు కలెక్టర్ వివరించారు. ఇందుకు కమిటీలు ఏర్పాటుచేశామని, ఈ కమిటీల్లో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, విశ్రాంత ఉద్యోగులు,ఏఎన్‌ఎం, ఆశ, సాక్షర భారత్ కార్యకర్తలను సభ్యులుగా నియమించి ఓటు ప్రాధాన్యం గురించి తెలియజేసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈనెల 15న జిల్లాలోని అన్ని గ్రామాల్లో సిగ్నేచర్ కాంపైన్ బోర్డుతో పర్యటిస్తారన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన వినుకొండ, మాచర్ల,గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, మిగిలిన 13 నియోజక వర్గాలలో ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని కలెక్టరు స్పష్టం చేశారు.
 
మరిన్ని వార్తలు