మోగిన ఎన్నికల నగారా

13 Apr, 2014 02:53 IST|Sakshi
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఆ మరుక్షణమే నామినేషన్ల స్వీకరణ ఘట్టానికి తెరలేచింది. జిల్లాలోని ఒక లోక్‌సభ, పది అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు శనివారం నోటిఫికేషన్లు జారీ చేశారు. అయితే తొలిరోజు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి తప్ప మిగతా నియోజకవర్గాలకు బోణీ పడలేదు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ సహా అందరు ఆర్వోలు తమ కార్యాలయాల్లో ఉదయం నుంచి తమ కార్యాలయాల్లోనే గడిపినా ఒక్కరు కూడా రాలేదు.
 
 అయితే శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి పిరమిడ్ పార్టీ తరఫున ఒక నామినేషన్ దాఖై లెంది. ఆ పార్టీ అభ్యర్థిగా డి.వీరభద్రరావు అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారి అయిన ఆర్డీవో గణేష్‌కుమార్‌కు నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 19 వరకు.. అదీ పనిదినాల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలకు పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందజేసేందుకు, దరఖాస్తు పత్రాలు పూర్తి చేయడంలో వారికి సహాయపడేందుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బంది, డేటా ఎంట్రీ అపరేటర్లు ఇక్కడ అందుబాటులో ఉంటారన్నారు. 
 
 13, 14, 18 తేదీలు సెలవు
 ఈ నెల 19 వరకు నామినేషన్ల దాఖలుకు గడువున్నప్పటికీ మధ్యలో మూడు రోజులు నామినేషన్లు స్వీకరించర ని కలెక్టర్ చెప్పారు. 13వ తేదీ ఆదివారం, 14వ తేదీ అంబేద్క ర్ జయంతి, 18న గుడ్ ఫ్రేడే సందర్బంగా ప్రభుత్వ సెలవులని వివరించారు. 21న నామినేషన్ల పరిశీలన  జరుగుతుందని, ఉపసంహరణకు 23 వరకు గడువు ఉంటుందన్నారు. 
 
>
మరిన్ని వార్తలు