కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి ఈసీ నిబంధనలు

12 May, 2014 00:51 IST|Sakshi

 ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులకు అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అభ్యర్థుల తరఫున ఎవరెవరూ ఏజెంట్లుగా ఉండొచ్చనే నిబంధనలను స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈవోల)కు ఆదేశాలు జారీ చేసింది. సిట్టింగ్ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అభ్యర్థుల తరఫున ఏజెంట్లుగా ఉండటానికి అనర్హులని ఈసీ స్పష్టం చేసింది. మునిసిపల్, నగర పంచాయతీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ సహకార సంస్థల చైర్మన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు నియమితులైన చైర్మన్లు కూడా ఏజెంట్లుగా అనర్హులని వెల్లడించింది. అలాగే ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులను ఏజెంట్లుగా అనుమతించరాదని పేర్కొంది.

వారిని మినహాయించి 18 ఏళ్ల వయసు నిండిన వేరెవరినైనా ఏజెంట్లుగా నియమించుకోవచ్చనిపేర్కొంది. స్థానికులనే నియమించుకోవాలనే నిబంధన ఏదీ లేదని వివరణ ఇచ్చింది. ప్రత్యేక సెక్యూరిటీ ఉన్న వ్యక్తులను ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులకు సెక్యూరిటీ ఉంటే... ఆ సిబ్బందిని సరెండర్ చేసిన తర్వాతే వారిని అనుమతించాలని పేర్కొంది. ఎస్‌పీజీ భద్రత ఉన్న అభ్యర్థులైతే ఒకే ఒక్క ఎస్‌పీజీతో మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించాలని, ఆ ఎస్‌పీజీ వ్యక్తి కూడా సాధారణ దుస్తులు ధరించే రావాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు