ఎన్నికల నిర్వహణలో జిల్లా రోల్ మోడల్ కావాలి

3 Apr, 2014 04:21 IST|Sakshi
 సాక్షి, కాకినాడ :జిల్లాలో ఈ నెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి సంయుక్తంగా బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలట్ బాక్సులను రిసెప్షన్ కేంద్రాల్లో తీసుకున్న తర్వాత గట్టి బందోబస్తుతో స్ట్రాంగ్ రూంలకు తరలించాలన్నారు. ఆ వాహనాల వెంబడి ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు తప్పనిసరిగా వెళ్లాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జిల్లా  ఎన్నికల యంత్రాంగం రోల్‌మోడల్‌గా వ్యవహరించిందని అభినందిస్తూ, పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే పంథాను అవలంబించాలన్నారు.
 
 మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైందని, పరిషత్ ఎన్నికల్లో కూడా ఇలాగే ఉండేలా చైతన్యం తేవడమే కాక, ఓటర్ల స్లిప్పులు అందరికీ పంచాలన్నారు. పోలింగ్ సిబ్బందికి భోజన ఏర్పాట్లు, టీడీఏ, డీఏల చెల్లింపులపై కలెక్టర్ అనంతరం సమీక్షించారు. అంతేకాకుండా బ్యాలట్ పత్రాల పరిశీలన ఒకటికి రెండుసార్లు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంలో వరుస క్రమంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. ఎక్కడ తప్పు జరిగినా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితి రానివ్వొద్దన్నారు. పోలింగ్ కోసం అవసరమైన నిధులు ఎంపీడీఓల ఖాతాలకు బదిలీ చేశామన్నారు. పోస్టల్ బ్యాలట్‌పై కూడా ఉద్యోగులు దృష్టి సారించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామని, ఇదే ఒరవడిని పరిషత్ ఎన్నికల్లో చూపాలన్నారు. రూట్ ఆఫీసర్లకు, జోనల్ ఆఫీసర్లకు, బ్యాలట్‌బాక్సుల తరలింపునకు డీటీసీ వాహనాలు సమకూరుస్తారన్నారు. సీఈఓ సూర్యభగవాన్ , డీఆర్‌ఓ యాదగిరి, ఆర్డీఓలు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు