బరిలో విద్యాధికులు

18 Apr, 2014 00:19 IST|Sakshi
బరిలో విద్యాధికులు

 అమలాపురం, న్యూస్‌లైన్ :సివిల్స్.. గ్రూప్ సర్వీసులు, ఎంటెక్.. ఎంబీఏలు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా రాణిస్తున్న ఎంతోమంది విద్యాధికులు ఎన్నికల బరిలో దిగారు. అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఉద్యోగాలు వదులుకుని వచ్చి రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించినవారు కొందరైతే.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు మరికొందరు కావడం గమనార్హం. అమలాపురం నుంచి బరిలో ఉన్న వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ బి.ఎస్సీ, బీఈడీ చేశారు. ఆయన ఉపాధ్యాయునిగా కూడా పనిచేసి రాజకీయాల్లో చేరారు. ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి 1987లో రాజకీయ రంగప్రవేశం చేశారు.
 
 తొలి నుంచి దివంగత నేత రాజశేఖరరెడ్డి వెన్నంటే ఉన్న విశ్వరూప్ 1998 ఉప, 99 సాధారణ ఎన్నికల్లో ముమ్మిడివరం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2004 ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి, 2009లో అమలాపురం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో గ్రామీణ నీటి సరఫరా శాఖ, 2010 నుంచి పశుసంవర్ధక, పాడి పరిశ్రమశాఖ మంత్రిగా పనిచేశారు. కాకినాడ లోక్‌సభ స్థానంలో పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్ చిల్లేర్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ స్ట్రాస్‌బర్గ్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్‌లో డిగ్రీ, యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ హాల్‌లో ఎంబీఏ ఇన్ బిజినెస్ ఫైనాన్స్ చేశారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చిన సునీల్ 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
 
 తాజాగా ఇదే స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజమండ్రి లోక్‌సభ స్థానం అభ్యర్థి బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి బిట్స్ పిలానీలో మాస్టర్ ఆఫ్ మేనేజ్‌హెంట్ స్టడీస్ చేశారు. అమెరికాలోని టెక్సాస్, డల్లాస్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్‌లో పీజీ పూర్తి చేశారు. యూఎస్, కెనడా, ఇంగ్లాండ్‌లో ఫార్మా ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేసిన ఆయన 2013 రాజకీయ రంగప్రవేశం చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. అమలాపురం అసెంబ్లీ నుంచి పోటీ పడుతున్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఎంఏ పూర్తి చేసిన అనంతరం గ్రూప్-1కు ఎంపికయ్యారు. డీపీవోగా, జెడ్పీ డిప్యూటీ సీఈవోగా, సీఈవోగా, పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్‌గా పనిచేశారు. 2009లో రాజకీయరంగ ప్రవేశం చేసిన ఆయన విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి తొలి యత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందా రు.
 
 రాజానగరం నుంచి పోటీచేస్తున్న జక్కంపూడి విజయలక్ష్మి బీ.ఏ, బిఎల్ చేశారు. కొంతకాలం న్యాయవాద వృత్తిలో పనిచేశారు. తొలి నుంచి భర్త దివంగత మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు చేదోడువాదోడుగా ఉంటూ ప్రజాసమస్యలపై ఆలుపులేని పోరాటం చేశారు. గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. రాజోలు అసెంబ్లీ నుంచి పోటీచేస్తున్న రాజేశ్వరరావు ఎం.టెక్ చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. పదవీ విరమణ తరువాత 2013లో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.  
 
 
 కాంగ్రెస్ పార్టీ నుంచి కాకినాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న కేంద్ర మానవవనరుల శాఖమంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ఉన్నత విద్యను అభ్యసించారు. ఏయూలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీఈ చేసిన ఆయన యూఎస్‌ఏలోని ఫిలోడెల్ఫియా టెంపుల్ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు. కాకినాడ లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి తోట నరసింహం బి.కామ్, ఐసీడబ్ల్యూఏ చేసి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగిగా పనిచేసి 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రెండుసార్లు జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రిగా పనిచేశారు.
 
 అమలాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పండుల రవీంద్రబాబు ఐపీఎస్, ఐఆర్‌ఎస్ చేశారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా చేస్తున్న ఆయన వీఆర్‌ఎస్ తీసుకుని లోక్‌సభ బరిలో నిలిచారు.  రాజానగరంలో నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పెందుర్తి వెంకటేష్ బి.టెక్ చేశారు. రాజోలు నుంచి టీడీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేస్తున్న గొల్లపల్లి సూర్యారావు ఎం.ఏ, బిఎల్ చేశారు. ఇటీవలే బార్ కౌన్సిల్లో ఆయన సభ్యత్వం తీసుకున్నారు. అమలాపురం నుంచి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు బి.ఎ, బి.ఎల్ చేశారు. రంపచోడవరం ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి కె.కాశీ విశ్వనాథ్ ఎం.టెక్ చేసి రక్షణశాఖలో పనిచేశారు. ఇండియన్ క్రీస్టియన్ సెక్యులర్ పార్టీ నుంచి పోటీచేస్తున్న సీహెచ్.శైలజ బిటెక్ ఇంజనీరింగ్ చేశారు. తుని నుంచి జై సమైక్యాంధ్ర తరఫున పోటీ చేయనున్న మెరుసు లీలా శ్రీనివాస్ ఎం.టెక్ చేసి అమెరికాలో సొంతంగా కంపెనీ నిర్వహిస్తున్నారు.
 
 కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న సి.హెచ్.పాండురంగరావు ఎంబీబీఎస్ (ఆయుర్వేదం) చేశారు. తునిలో సొంతంగా ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. రాజమండ్రి కాంగ్రెస్ అభ్యర్థి కందుల దుర్గేష్ ఎంఏ చేశారు. రాజమండ్రి రూరల్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీచేస్తున్న వడ్డి మల్లిఖార్జునప్రసాద్ బి.ఎ, బిఎల్ చేసి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పి.గన్నవరం నుంచి స్వతంత్రంగా బరిలో దిగిన మందాపాటి కిరణ్‌కుమార్ బి.టెక్ సివిల్ చేశారు. ఉన్నత విద్యావంతులైన ఈ అభ్యర్థులంతా త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మరిన్ని వార్తలు