హుష్...‘సార్వత్రిక’ ప్రచారానికి తెర

29 Apr, 2014 02:42 IST|Sakshi
హుష్...‘సార్వత్రిక’ ప్రచారానికి తెర
  • ఇక ప్రలోభాలకు ఎర
  • మద్యం, క్రికెట్ కిట్‌లు, నగదు పంపిణీకి రంగం సిద్ధం
  • అడ్డుకట్ట వేసేందుకు అధికారుల సన్నద్ధం
  •  ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: గత 15 రోజులుగా హోరెత్తిన సార్వత్రిక ప్రచార పర్వానికి తెరపడింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి. దీంతో ఇప్పటి వరకు ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు, అన్ని పార్టీల నేతలు క్యాంపు కార్యాలయాల్లో సమీకరణలు సాగిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకున్న అభ్యర్థులు ఇప్పుడు అధిక ఓట్లు సాధించడమే లక్ష్యంగా మంత్రాంగం నెరుపుతున్నారు.
     
     ఈనెల 30వ తేదీన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుండగా... 48 గంటలు ముందుగా ప్రచార పర్వానికి ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఇప్పటి వరకు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అభ్యర్థుల గెలుపు కోసం మండుటెండల్లో సైతం ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా అభ్యర్థుల ఫొటోలతో ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలు దర్శనమిస్తున్నాయి. ఆటోలు, వాహనాలపై మైకులతో ప్రచార హోరు సాగించారు. ఇలా నెలరోజులుగా నెలకొన్న సందడి ఒక్కసారిగా ఆగిపోవడంతో పల్లెలు, పట్టణాల్లో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.
     
     జిల్లాలో పోటీ చేస్తు న్న వారిలో ఎక్కువ మంది హేమాహేమీలు ఉండడంతో ఇక్కడి రాజకీయలపై రాష్ట్ర వ్యా ప్తంగా చర్చ జరుగుతోంది. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా కంకణాల నారాయణ, టీడీపీ అభ్యర్థిగా నామానాగేశ్వరారవు బరిలో ఉండడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అలా గే పలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న వారిలో ఏళ్ల తరబడి మంత్రులుగా పనిచేసిన వారు ఉండడంతో రాజకీయం వేడెక్కుతోంది. పోలింగ్ సమయం ముంచుకొస్తుండడంతో జిల్లా రాజకీయాలపై ఓటర్లు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.
     
     ఇక నోటుతో ఎర...
     మైకు ప్రచారానికి తెరపడటంతో ఆయా పార్టీల నాయకులు, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. బహిరంగంగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు, నా యకులు ఇక  తెరచాటు రాజకీయానికి వ్యూహా లు పన్నుతున్నారు. నోట్ల కట్టలు, మద్యం బాటిళ్లు, యువతకు క్రికెట్ కిట్‌లతోపాటు వివిధ రకాల బహుమతులతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన సామగ్రిని ఇప్పటికే వారి కార్యాలయాల్లో, కార్యకర్తలు, అనుచరుల ఇళ్లలో నిల్వ ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఆఖరి అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థి రూ.70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థులు రూ.28 లక్షల వరకే ఖర్చు చేయాలని ఎన్నికల నిబంధన ఉన్నప్పటికీ, ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.కోట్లలోకి చేరిందని అధికారులు భావిస్తున్నారు.  
     
     యువతను ఆకట్టుకునేందుకు ఎత్తులు..

     ఈ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కానుండటంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు వారిని ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. క్రికెట్ కిట్‌లు, మద్యం బాటిళ్లను పెద్ద ఎత్తున సేకరించి సిద్ధం చేసుకున్నారు. ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌కు చెందిన మమత మెడికల్ కళాశాలలో పంచేందుకు సిద్ధంగా ఉంచిన క్రికెట్ కిట్‌లు, మద్యం బాటిళ్లను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు గత ఐదారు రోజులుగా పలువురి వాహనాల్లో నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థుల అనుచరుల నుంచి కూడా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలా పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు రూ.1.23 కోట్లకు చేరుకుందని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో డబ్బు ఎంత విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారో ఊహించవచ్చు.
     
     అడ్డుకట్ట వేసేందుకు అధికారుల వ్యూహం...
     డబ్బు పంపకం, మద్యం, క్రికెట్ కిట్‌ల పంపిణీలతో ఓటర్లను ప్రభావితం చేస్తుంటడంతో వీటికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా అధికారులు  పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం సరికొత్త పద్ధతిలో వ్యూహాలు పన్నుతున్నారు. మండలాలతోపాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను వేశారు. అలాగే ఎన్నికల వ్యయ పరిశీలకులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్ తదితర బృందాలతో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న వాహనాలతోపాటు అభ్యర్థులు, వారి అనుచరుల ఇళ్లపై కూడా దాడులు చేసేందుకు దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటినుంచి పోలీసులు వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బస్టాండ్‌లు, కూడళ్ల వద్ద కూడా భారీ స్థాయిలో నగదు తీసుకెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లెక్కలు చూపని వాటిని సీజ్ చేస్తున్నారు. పోలింగ్ రోజున అభ్యర్థులు ఎటువంటి ప్రచారం నిర్వహించవద్దని, జెండాలు ప్రదర్శించవద్దని, ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు