ముగిసిన నామినేషన్ల పరిశీలన

11 Apr, 2014 05:59 IST|Sakshi
నల్లగొండ : నామినేషన్లు పరిశీలిస్తున్న కలెక్టర్ చిరంజీవులు

అర్హత సాధించింది 279 మంది.. తిరస్కరణ 75
 రేపటితో ముగియనున్న ఉపసంహరణ గడువు
 

 సాక్షి, నల్లగొండ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన గురువారం ముగిసింది. ఇందులో వివిధ కారణాల వల్ల 75మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ప్రధానంగా ప్రతిపాదకుల పేర్లు చేర్చకపోవడం, అభ్యర్థుల సంతకాలు లేకపోవడంతో పాటు కొందరిపై కేసులు ఉండడంతో తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు 354మంది అభ్యర్థులు 617 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

 

అందులో ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఉన్న 75మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. తద్వారా 279మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో రెండు లోక్‌సభ స్థానాలకు 23మంది, 12 అసెంబ్లీ స్థానాలకు 256మంది అభ్యర్థులు ఉన్నారు. శుక్రవారం అభ్యర్థుల నుంచి అధికారులు అప్పీలు స్వీకరిస్తారు. ఈ నెల 12వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు మిగిలింది. ఉపసంహరణ రోజే బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు వెల్లడిస్తారు.

మరిన్ని వార్తలు