ఇంద్రవెల్లి మానని గాయాలు..

27 Apr, 2014 05:49 IST|Sakshi
ఇంద్రవెల్లి మానని గాయాలు..

-    ఎన్నికలు వస్తున్నాయి.... పోతున్నాయి... కానీ ఇంద్రవెల్లి గాయం మానలేదు
-   బాధితుల భయం పోలేదు.. బతుకు భారం తీరలేదు

 
ఇంద్రవెల్లి నుంచి ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలు వస్తున్నాయి.... పోతున్నాయి.... కానీ ఈ ప్రాంతంలోని ప్రజలకు తగిలిన గాయం మాత్రం మానలేదు. దాని ఆనవాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఎంత మంది ఎన్ని హామీలు ఇచ్చినా... తర్వాత అవి నీటిమాటలుగానే మిగిలి పోతున్నాయి. సుమారు 33 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన సంఘటన రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది.
 
 ఆదివాసి గిరిజనులకు అటవి భూమిపై హక్కు కల్పించాలనే డిమాండ్‌లో ఇంద్రవెల్లిలో రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పోలీసు కాల్పులు జరిగి అనేక మంది మృతి చెందారు. పోలీసుల రికార్టు ప్రకారం 13 మందే చనిపోయారని చెప్పుతున్నా... అందుకు నాలుగైదు రెట్ల మించి గిరిజనులు మృతి చెందారని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. ఆ రోజు సోమవారం అంగడి (సంత) కావడంతో సమావేశానికి సంబంధం లేని ప్రజలు కూడా పలువురు మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది పిట్టబొంగారం, తాటిగూడ, ఖన్నాపూర్, వడగం వంటి గ్రామాల్లోని ప్రజలే.  నాయకులు ఇక్కడికి వచ్చి బాధితులకు అనేక హామీలను ఇవ్వడం.... తర్వాత  వాటిని మరచిపో వడం ప్రతి ఎన్నికల్లోనూ జరుగుతున్నది. సాక్షి ప్రతినిధి ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు బాధితుల్లో ఆనాటి సంఘటనపై భయం స్పష్టంగా కనిపించింది.
 
 ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రజా సంఘాలతో పాటు స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు పలు సార్లు ఈ గ్రామాలను సందర్శించి అధ్యయనం చేశారు. అయితే... దీని వల్ల మాకు మాత్రం వొరిగింది ఏమీ లేదనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఇప్పటికీ ఉంది. ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా... మాకు జరిగిన మేలు ఏమీ లేదనే నిరాశలో వారున్నారు. సంఘటన జరిగినప్పుడు చనిపోయిన కుటుంబ సభ్యుల మృతదేహాలను కడసారి కూడా చూడనివ్వలేదని గుర్తు చేసుకుంటున్నారు. పోలీసులే మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించారని చెప్తున్నారు. అయితే పోలీసులకు తెలియకుండా కొందరు తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను తీసుకువచ్చి, గుట్టుగా అంత్యక్రియలను నిర్వహించినట్టు గ్రామస్తులు వివరిస్తున్నారు. మరికొందరు ఇంట్లోనే మృతదేహాలను రెండు మూడు రోజులు ఉంచుకుని వీలు చిక్కినప్పుడు ఎవరికి తెలియకుండా అంత్యక్రియలను నిర్వహించారు. దాంతో పలువురు సకాలంలో చికిత్స అందక కూడా మృతి చెందినట్టు ఇక్కడి ప్రజలు పేర్కొంటున్నారు.
 
 వైఎస్ వచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చారు ...
 కాగా భూముల కోసం మేం చేసిన ఆందోళనను పరిగణనలోకి తీసుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో న్యాయం జరిగిందని పిట్ట బొంగారం గ్రామానికి చెందిన సిడం భీంరావ్ చెప్తున్నారు. చట్టంలో మార్పు తీసుకువచ్చి మేం సాగు చేసుకుంటున్న భూములపై మాకే హక్కు ఉండేటట్టు వైఎస్సార్ చేశారని ఆయన గుర్తు చేశారు. తద్వారా ఎందరికో మేలు జరిగిం దన్నారు. ఎప్పుడో మా తాతల నాడు భూ పట్టా లు ఇచ్చారు.. మళ్లీ వైఎస్సార్ హయాంలో మేలు జరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు