'చెడిపోయిన రాజకీయాలు చూస్తుంటే బాధనిపిస్తోంది'

2 May, 2014 11:55 IST|Sakshi
'చెడిపోయిన రాజకీయాలు చూస్తుంటే బాధనిపిస్తోంది'

తిరువూరు : తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న జగన్ శుక్రవారం తిరువూరు నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారని, ఆ ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి వీరు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా చెప్పగలరా సూటిగా ప్రశ్నించారు. ఆరోజు మీకు పోలవరం ప్రాజెక్ట్, పులిచింతల ప్రాజెక్ట్, హంద్రీనీవా ప్రాజెక్ట్ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నలు సంధించారు. మన రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లు ఉంటే.. ఇంటింటికి ఉద్యోగం ఎలా ఇస్తావు చంద్రబాబు అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు మనమే గెలుచుకుని మోడీ ప్రధాని కావాలా? మరొకరు కావాలా? అనేది మనమే నిర్ణయిద్దామని జగన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. 9ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హామీనైనా అమలు చేశారని అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రూ.2 కిలో బియ్యాన్ని రూ.రూ.5.25 చేసింది చంద్రబాబేనని, ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి...ఎన్నికల తర్వాత ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు తీసుకొచ్చింది ఆయనేనని జగన్ గుర్తు చేశారు.

రామరాజ్యం అయితే తాను చూడలేదని...వైఎస్ఆర్ సువర్ణయుగం చూశానని వైఎస్ జగన్ అన్నారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్ధం లేకుండా పోయిందన్నారు. రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాలని ఆయన పేర్కొన్నారు.  మొన్నటివరకు తెలంగాణలో తిరుగుతూ తమ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ చెప్పుకొన్న నరేంద్ర మోడీ, చంద్రబాబు.. అక్కడ ఎన్నికలైపోయిన రాత్రికి రాత్రే మాట మార్చి విభజనకు కారణం జగనే అంటున్నారని, చెడిపోయిన ఈ రాజకీయాలు చూస్తుంటే చాలా బాధనిపిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు