తిట్టుకున్నారు.. కొట్టుకున్నారు...

13 Apr, 2014 03:54 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్: ఇంతకాలం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వర్గపోరుసాగిస్తున్న భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. తిట్లపురాణం సాగిస్తూ ఒకరిపై ఒకరు దాడులకు దిగి ఎన్నికల తరుణంలో పార్టీపరువును రచ్చకీడ్చారు.   కేంద్రమంత్రి, మహబూబాబాద్  పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరామ్‌నాయక్ సమక్షంలో సాగిన ఈ యుద్ధకాండను చూసి పార్టీ శ్రేణులు నివ్వెరపోయాయి. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో గెలుపుకోసం ఏ రీతిన ముందుకెళ్లాలనే దానిపై కేంద్రమంత్రి బలరామ్‌నాయక్ భద్రాచలం నియోజకవర్గం నాయకులతో ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో శనివారం నిర్వహించిన సమావేశం కాంగ్రెస్ వర్గపోరుకు వేదిక అయింది. ఎమ్మెల్యే కుంజా సత్యవతి వర్గీయులు, ఆమె వ్యతిరేక వర్గీయులు రెచ్చిపోయారు....ముష్టియుద్ధానికి దిగారు.  

భద్రాచలం జడ్పీటీసీ టిక్కెట్టు విషయమై చింతిర్యాల రవికుమార్ ప్రస్తావించి, తనకు రాకుండా చేశారని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే సత్యవతి తన వ్యతిరేక వర్గీయులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొంతమంది నాయకులు మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అసభ్య పదజాలంతో తిట్ల పురాణం అందుకున్నారు. దీనికి  పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు నక్కా ప్రసాద్ అభ్యంతరం తెలపడంతో ఆయనపై సత్యవతి ఆగ్రహించారు.   తన కాలికున్న చెప్పును తీసి నక్కా ప్రసాద్‌పై లేపారు. అంతే ఇరువర్గాల మధ్య తీవ్రపెనుగులాట జరిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈఘటనలో నక్కా ప్రసాద్ చొక్కాచిరిగిపోయి... ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది.   ఎమ్మెల్యే అనుచరుడికి కూడా మెడపై గాయాలయ్యాయి.  
 
 ఇరువర్గాల వారిని సముదాయించే క్రమంలో కేంద్రమంత్రి బలరామ్‌నాయక్ కింద పడిపోయారు. ఈ గొడవ అంతా  పార్టీ ముఖ్య నాయకులు ఎడమకంటి రోశిరెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కురిచేటి రామచంద్రమూర్తి, ఎమ్మెల్యే భర్త కుంజా ధర్మా, డివిజన్ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, రమేష్‌గౌడ్, దొంతుమంగేశ్వరరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి దాదాపు డివిజన్ నాయకత్వ మంతా చూస్తుండగానే జరిగింది. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న తరుణంలో తమతో పనిచేయించుకోవాల్సిన ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఇలా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ బలప్రయోగం చేయడమేంటని వ్యతిరేకవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఆమె తరఫున పనిచేసేది లేదంటూ తెగేసి చెబుతున్నారు.
 
 నక్కా ప్రసాద్‌ను అరెస్ట్‌చేయకపోతే
 ఆందోళన చేస్తా : సత్యవతి
 అనేకసార్లు తనను తీవ్రంగా అవమానించిన నక్కా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఆందోళన చేస్తానని ఎమ్మెల్యే కుంజా సత్యవతి అన్నారు. సంఘటన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దొంగనోట్ల చెలామణి, దందాలు చేస్తున్న నక్కా ప్రసాద్‌ను భద్రాచలంలో లేకుండా చేస్తానన్నారు. అతనిపై ఇక సహించేదే లేదని, కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇడ్లీ అమ్ముకునే వ్యక్తికి లక్షలు ఎలా వచ్చాయని, అతని ఆస్తులపై విచారణ చేయాలన్నారు. అటువంటి వ్యక్తిని ఇక ఉపేక్షించేదే లేదని తీవ్రమైన పదజాలాన్నే ఉపయోగించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన భద్రాచలం ఎస్సై మురళికి ఆమె జరిగిన సంఘటనపై వివరించారు.  వెంటనే నక్కా ప్రసాద్‌పై రౌడీ షీటు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.
 
 ఎమ్మెల్యే దంపతులు భూ కబ్జాదారులు :
  ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని కుంజా సత్యవతి, ఆమె భర్త ధర్మా భద్రాచలంలో భూ దందాలు చేశారని నక్కా ప్రసాద్ ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ  రెండు సెంట్ల భూమి కనిపిస్తే దాన్ని కబ్జా చేయటమే ధర్మా పని అన్నారు. పదవిని అడ్డుపెట్టుకొని ఖాళీ స్థలాలను ఆక్రమించటం, ఆనక ఇరువర్గాల మధ్య సెటిల్ మెంట్లు చేసి డబ్బులు గుంజుతారని, తమ దుకాణ సముదాయ వివాదాన్ని పరిష్కరిస్తామంటూ రూ.11 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇటువంటి వారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఫలితం అనుభవించాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 పక్కగదిలోనే ఎన్నికల అబ్జర్వర్ :
 కాంగ్రెస్ నాయకుల కుమ్ములాటలు జరిగిన పక్కగదిలోనే ఎన్నికల అబ్జర్వర్  యశ్‌వీర్ మహాజన్ బసచేసి ఉన్నారు. వీరి ఘర్షణపై సదరు అధికారి ఎప్పటికప్పుడు వాకబు చేసినట్లుగా తెలిసింది. అయితే దీనిపై ఎవ్వరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు కఠినంగానే ఉండే  అవకాశం ఉందని ఓ పోలీస్ అధికారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఇదిలా ఉండగా సంఘటన ప్రదేశం బూర్గంపాడు స్టేషన్ పరిధిలోకి వస్తుందని, అక్కడ కేసు నమోదైనట్లైతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడికి బదలాయించి తగిన చర్యలు తీసుకుంటామని పట్టణ ఎస్సై మురళి తెలిపారు.
 

మరిన్ని వార్తలు