ఫైనల్ టెస్ట్... నో రెస్ట్

24 Apr, 2014 03:46 IST|Sakshi

 ప్రస్తుతం అన్ని పక్షాల నేతలు ఫైనల్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. విరామ మెరుగని ప్రచారంతో ఓటర్ల ముంగిట క్యూ కడుతున్నారు. ప్రచార ఘట్టం మరో అయిదురోజుల్లో ముగియనుండడంతో కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. మరో వైపు ఆయా పార్టీల పెద్దలు చేసిన పర్యటనలతో వచ్చిన కొత్త ఉత్సాహంతో శ్రమిస్తున్నారు. ఎత్తుగడలకు పదును పెడుతూ ఎదుటి పక్షం వారిని లొంగదీసుకోడానికి ‘సామ,దాన,భేద’ ప్రయోగాలు  ప్రదర్శిస్తున్నారు.అహరహం చెమటోడ్చుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: టికెట్లు ఖరారైనా ప్రచారాన్ని పట్టాలెక్కించడంలో ఇబ్బందులు పడిన అభ్యర్థులు ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రచారం మరో ఐదు రోజుల్లో ముగియనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలు ముఖ్య నేతలను రప్పించడం ద్వారా ప్రచా ర వేడిని రగిలించే ప్రయత్నం చేశాయి. ఇన్నాళ్లూ ప్రచార ప్రణాళిక రూపొందించిన అభ్యర్థులు ప్రస్తుతం ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్‌షోలు, పాదయాత్రలు, ఇంటింటి ప్రచారానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. వీలైనన్ని గ్రామాలను చుట్టి రావడం ద్వారా క్షేత్ర స్థాయిలో తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
 ఇదే సమయంలో గ్రామాల్లో వివిధ పార్టీల్లో కొనసాగుతున్న వారికి కండువాలు కప్పి సొంత పార్టీలోకి రప్పించేలా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ కూటమి, టీఆర్‌ఎస్ ఇప్పటికే భారీ బహిరంగ సభలు నిర్వహించాయి. 21, 22 తేదీల్లో వరుసగా రాహుల్, నరేంద్ర మోడీ, చంద్రబాబుతో మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కూటమి మరిన్ని బహిరంగ సభలు నిర్వహించే యోచనలో కనిపించడం లేదు. జిల్లాలో విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్న టీఆర్‌ఎస్ మరిన్ని సభలు నిర్వహించే యోచనలో ఉంది.
 
 రాహుల్, మోడీ ప్రచార ప్రభావం నుంచి ఓటర్లను బయట పడేసే విధంగా సభల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. టీఆర్‌ఎస్ ఇప్పటికే మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాలలో బహిరంగ సభలు నిర్వహించింది. ఈ నెల 25న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పది చోట్ల బహిరంగ సభలకు హాజరవుతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి లేదా ఆయన సోదరి షర్మిలను జిల్లాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 అంతర్గత వ్యూహాలపై కసరత్తు
 ఓ వైపు ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తూనే మరోవైపు అభ్యర్థులు అంతర్గత వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎదుటి పార్టీ, అభ్యర్థి బలహీనతలు, ప్రలోభాలు వంటి అంశాలపై అభ్యర్థులు దృష్టి సారించారు. మద్యం, డబ్బు పంపిణీ, ప్రత్యర్థి పార్టీల్లో కీలక నేతలను కొనుగోలు చేయడం వంటివి లోలోన జోరుగా సాగుతున్నాయి. పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలో నిమగ్నమయ్యేలా చూడటం ద్వారా ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎదుటి పార్టీ ప్రచార తీరు తెన్నులను నిశితంగా పరిశీలిస్తూ సొంత ప్రచారంలో లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో కీలక వ్యక్తులను గుర్తిస్తూ వారి సహకారాన్ని కోరుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచార పర్వంలో మునిగి తేలుతున్న అభ్యర్థులు తెల్లవారు ఝాము వరకు అనుచరులు, ముఖ్యులతో సమాలోచనలు జరుపుతున్నారు. ప్రచార ఘట్టం కీలక దశకు చేరుకుంటుండటంతో క్షణం వృధా చేసినా ప్రత్యర్థి పైచేయి సాధిస్తాడనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది.
 

మరిన్ని వార్తలు